vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 12:42 pm Posted by : వార్తా జిఎస్‌బి

అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి ముమ్మిడివరంలో దళిత సంఘాల నిరసన.. పోలీసు, రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు

ముమ్మిడివరం ఆగస్ట్ 03 ( రిపోర్టర్ వేణు కాశి)..ఆర్. అంబేడ్కర్‌పై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నాగులారపు వర ప్రసాద్ అలియాస్ హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘాల ఆధ్వర్యంలో ముమ్మిడివరంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ముమ్మిడివరం, అయినవిల్లి మండలాల పరిధిలోని పొట్టిలంక, కొండుకుదురు, లంకాఫ్ ఠాణేలంక, కమిని తదితర లంక గ్రామాలకు చెందిన దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ముమ్మిడివరం ఎస్‌ఐ, తహసీల్దార్‌లకు వినతిపత్రాలు సమర్పించి తమ ఆందోళనను తెలియజేశారు.

ఈ సందర్భంగా దళిత సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, హమారా ప్రసాద్ సోషల్ మీడియా, యూట్యూబ్ తదితర మాధ్యమాల ద్వారా కుల, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను ఉద్దేశించి చేసినట్లు ఆరోపిస్తున్న అవమానకర వ్యాఖ్యలు కోట్లాది మంది అంబేడ్కర్‌వాదుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

అంబేడ్కర్‌పై అసత్యాలు, కల్పితాలను ప్రచారం చేయడం, ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కుల, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను తక్షణమే అరికట్టాలని, హమారా ప్రసాద్‌పై సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ప్రతినిధులు పోలీసు, రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు.

అంబేడ్కర్‌ను అవమానించడాన్ని సహించబోమని.. చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు.