vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 2:56 pm Posted by : వార్తా జిఎస్‌బి

అభిమానం ఉండాలి… కానీ ప్రాణాలను బలితీసుకునే ఉన్మాదం కాదు..! –కాశి రామకృష్ణ

ఐ. పోలవరం సెప్టెంబర్ 02 ( జియస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి) సినిమా హీరోల సినిమా విడుదలలు అయినా… రాజకీయ నాయకుల పుట్టినరోజులు అయినా… రాజకీయ ఊరేగింపులు, ఇతర ర్యాలీలు అయినా… కొందరు యువత రోడ్లపై చేస్తున్న ప్రమాదకరమైన విన్యాసాలు చూస్తుంటే నిజంగా గుండె తరుక్కుపోతోంది.

బైక్‌లపై పరిమితికి మించిన వేగంతో దూసుకెళ్లడం… సైలెన్సర్లను మార్చి భయానక శబ్దాలతో రోడ్లపై హంగామా చేయడం… ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా ఒకరిని చూసి మరొకరు పోటీ పడటం… క్షణికానందం కోసం ప్రాణాలతో చెలగాటమాడటం నిత్యకృత్యంగా మారుతోంది.

కానీ ఒక్కసారి ఆలోచించండి…

ఆ కొన్ని నిమిషాల ఆనందం కోసం మన ప్రాణాలను పణంగా పెట్టడం అవసరమా?

ఈ పిచ్చి వేగం… ఈ ప్రమాదకరమైన ర్యాలీలు… ఈ నిర్లక్ష్యపు విన్యాసాలు చివరకు ఘోర ప్రమాదాలకు దారితీస్తున్నాయి. నిండు నూరేళ్లు జీవించాల్సిన యువకులు రోడ్డు ప్రమాదాల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు కాళ్లు, చేతులు విరిగి జీవితాంతం వైకల్యంతో బాధపడుతున్నారు.

అభిమానం పేరుతో చేసే ఈ ఉన్మాదం చివరకు కన్నవారికి తీరని శోకాన్ని మాత్రమే మిగులుస్తోంది.

ఈరోజు జరిగిన ఘటనలు నా మనసును తీవ్రంగా కలచివేశాయి…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా జరిగినట్లు వెలువడిన ప్రమాద వార్తలు నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేశాయి.

ఫ్లెక్స్ ఏర్పాటు చేసే సమయంలో ఒక యువకుడు విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడనే వార్త వినగానే మనసు ముక్కలైంది. ర్యాలీ సందర్భంగా మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఇంకొకరు గాయాలపాలయ్యారని తెలిసి మరింత బాధ కలిగింది.

రెక్కలు ముక్కలు చేసుకుని… కంటికి రెప్పలా తమ పిల్లలను పెంచిన తల్లిదండ్రులు…

ఒక్కసారిగా తమ బిడ్డ మృతదేహాన్ని చూడాల్సి వస్తే వారి గుండె ఎంతగా తల్లడిల్లుతుందో ఊహించగలమా?

కాళ్లు, చేతులు విరిగి జీవితాంతం బాధపడుతున్న తమ పిల్లలను చూస్తూ ఆ తల్లులు కార్చే కన్నీళ్లను ఎవరు తుడవగలరు?

ఏ నాయకుడు వచ్చి ఆ తల్లి కడుపుకోతను తీర్చగలడు?
ఏ హీరో వచ్చి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలడు?

ఎవరూ చేయలేరు…

అందుకే నాయకులపై అభిమానం ఉండొచ్చు… హీరోలపై ప్రేమ ఉండొచ్చు… రాజకీయ పార్టీలపై విశ్వాసం ఉండొచ్చు…

కానీ ఆ అభిమానం మన ప్రాణాలను బలితీసుకునేంత ఉన్మాదంగా మారకూడదు..!

యువత ఒక్కసారి తమ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి.

మీకు ఏదైనా జరిగితే… మీ కోసం కన్నీరు పెట్టుకునేది ఆ నాయకుడు కాదు… ఆ హీరో కాదు…

మిమ్మల్ని తొమ్మిది నెలలు మోసిన తల్లి…
మీ భవిష్యత్తు కోసం కష్టపడిన తండ్రి…
మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే కుటుంబ సభ్యులే..!

అందుకే క్షణికానందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.

అధికారులు, పోలీసులు ఇకనైనా కఠిన చర్యలు తీసుకోవాలి

అనుమతి లేని బైక్ ర్యాలీలను, ప్రమాదకరమైన ఊరేగింపులను కచ్చితంగా అడ్డుకోవాలి. అతివేగంతో వాహనాలు నడిపేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి.

ప్రతి సంవత్సరం హీరోల సినిమా విడుదలలు, రాజకీయ నాయకుల పుట్టినరోజులు, ఇతర వేడుకల సందర్భంగా జరుగుతున్న ప్రమాదాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది.

ప్రమాదం జరిగిన తర్వాత విచారం వ్యక్తం చేయడం కంటే…

ప్రమాదం జరగకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం అత్యవసరం.

అధికారులకు, పోలీసు శాఖకు చేతులెత్తి నమస్కరిస్తూ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను…

దయచేసి రాబోయే రోజుల్లో ఇలాంటి అనుమతి లేని, ప్రమాదకరమైన ర్యాలీలు మరియు ఊరేగింపులపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి.

భవిష్యత్తులో ఏ తల్లి తన కొడుకును ఇలాంటి ప్రమాదాల్లో కోల్పోయి కన్నీరు పెట్టుకునే పరిస్థితి రాకూడదు…

ఏ కుటుంబం కూడా క్షణికానందం పేరుతో జీవితాంతం కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఎదుర్కోకూడదు…

ప్రతి యువకుడు క్షేమంగా ఇంటికి చేరాలి…

ప్రతి తల్లి తన బిడ్డను నవ్వుతూ చూడాలి…

అభిమానం ప్రాణాలను కాపాడేదిగా ఉండాలి… ప్రాణాలను బలితీసుకునేదిగా కాదు..!

భగవంతుడిని ప్రార్థిస్తూ… ఇకపై ఇలాంటి విషాద ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నాను.

యువతకు ఒకే సందేశం —

వేడుక చేసుకోండి… ఆనందించండి… కానీ ప్రాణాలతో చెలగాటమాడకండి..!

— కాశి రామకృష్ణ, ముమ్మిడివరం
📞 9949050977