vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 9:56 am Posted by : వార్తా జిఎస్‌బి

అర్ణబ్ తుఫాన్‌తో దెబ్బతిన్న వరి పొలాల పరిశీలన.. రైతుల గోడు విన్న కేంద్ర బృందం! పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ దెబ్బ.. రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి నష్టం కౌలు రైతులను ఆదుకోవాలి.. ఎండోమెంట్ భూముల శిస్తు రద్దు చేయాలని విజ్ఞప్తి


            తాళ్లరేవు: నవంబర్ 01( జీఎస్ బి వార్త )               అర్ణబ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వరి పంట పొలాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ పరిధిలోని బాపనపల్లి గ్రామంతో పాటు కాజులూరు మండలం కోలంక ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావానికి దెబ్బతిన్న వరి పొలాలను బృంద సభ్యులు సందర్శించి పంట నష్టం తీవ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలు, నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ దెబ్బ.. రైతుల ఆవేదన

ఈ సందర్భంగా గ్రామ రైతులు తమ కష్టాలను కేంద్ర బృందం సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కౌలు రైతులు ఎకరాకు సుమారు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టి వరి సాగు చేశామని, పంట చేతికొచ్చే సమయంలో అర్ణబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపడంతో పంట పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సాగు చేసిన పంట నాశనం కావడంతో పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని వివరించారు.

కౌలు రైతులకు ప్రత్యేక పరిహారం అందించాలి

తుఫాన్ కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిందని, పంట నష్టంతో పాటు పశువులకు అవసరమైన పశుగ్రాసం కూడా అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు. ఎండోమెంట్ భూములకు సంబంధించి శిస్తును రద్దు చేయాలని కేంద్ర బృందాన్ని కోరారు. పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, భూములు సాగు చేస్తున్న కౌలు రైతులను కూడా గుర్తించి తగిన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. తమ జీవనాధారమైన వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో పడిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదుకోవాలని కోరారు.

కేంద్ర బృందంలో ఉన్నతాధికారులు

కేంద్ర బృందంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (IS-II) శ్రీ చిత్తరంజన్ దాస్, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ ఏడీసీ (ఎక్స్‌టెన్షన్) శ్రీ ప్రశాంత్ ఆర్మూర్కర్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ హిమాలయ గార్గ్, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ (CEA) డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ప్రణయ్ గార్గ్ పాల్గొన్నారు.

జిల్లా, వ్యవసాయ శాఖ అధికారుల హాజరు

జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ అపూర్వ భరత్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ వి.టి. రామారావు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ శ్రీ ఎం. ఆనందరావు, మారుటేరు శాస్త్రవేత్త డాక్టర్ పి.వి. రమణరావు, డీఏఏటీ సెంటర్ శాస్త్రవేత్త ఏ. సీతారామశర్మ, కరప సబ్ డివిజన్ ఏడీఏ ఎన్. ప్రశాంతి, తాళ్లరేవు మండల వ్యవసాయ అధికారి, కాజులూరు మండల వ్యవసాయ అధికారి వి. అశోక్, ఏఈఓలు, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

కేంద్ర బృందానికి రైతుల వినతి

బాపనపల్లి గ్రామానికి చెందిన రైతులు విల్ల మంగాపతిరావు, ఏ. రామకృష్ణరాజు, మోపురి వెంకటేశ్వరరావు, నీల లావరాజు, గుత్తుల రాంబాబు, కొండేపూడి నూకరాజు, రక్షా ఆంజనేయులు, విల్ల రెడ్డినాయుడు తదితరులు కేంద్ర బృందానికి తమ సమస్యలను వివరించారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని రైతులకు, కౌలు రైతులకు తగిన పరిహారం అందించి వ్యవసాయ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.