vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 12:38 pm Posted by : వార్తా జిఎస్‌బి

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ద్వారా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అనుసంధానానికి కేంద్రం చర్యలు*: *రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ద్వారా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అనుసంధానానికి కేంద్రం చర్యలు రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు·

రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్నకు కేంద్రం వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 4(జిఎస్ బి వార్త)

ఆంధ్రప్రదేశ్‌లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను (PSPs) గ్రీన్ ఎనర్జీ కారిడార్‌తో అనుసంధానం చేయడం, వాటి అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై మంగళవారం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ కీలక వివరాలను వెల్లడించింది.కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ ఎస్సో నాయక్ రాజ్యసభలో సమాధానం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి గ్రీన్ ఎనర్జీ కారిడార్ (GEC) రెండో దశలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను అనుసంధానం చేయాలని ప్రతిపాదనలు అందాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో (APTRANSCO) ద్వారా రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతం కోసం సమర్పించినట్లు పేర్కొన్నారు.అలాగే, గ్రీన్ ఎనర్జీ కారిడార్ రెండో దశను కేంద్ర ప్రభుత్వం రూ.11,500 కోట్ల వ్యయంతో అమలు చేస్తోందని, ఇందులో కేంద్ర ఆర్థిక సహాయంతో పాటు రాష్ట్ర భాగస్వామ్య నిధులు కూడా వినియోగిస్తున్నట్లు వివరించారు.పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. పర్యావరణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, అటవీ అనుమతుల నిబంధనల్లో సడలింపులు, తవ్వకాల అనంతరం పునర్వనీకరణకు సంబంధించి మార్గదర్శకాలు, అలాగే పరిశోధనాత్మక డ్రిల్లింగ్ వంటి కార్యకలాపాలకు అనుమతులు కల్పించడం ద్వారా ప్రాజెక్టుల అమలుకు ఊతమిస్తున్నట్లు వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు అవసరమైన మౌలిక వసతులు, విద్యుత్ ప్రసార వ్యవస్థ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.