vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 11:28 am Posted by : వార్తా జిఎస్‌బి

ఏపీ తీర ప్రాంతాల్లో వరద నీటి నిర్వహణ, నగరాల అభివృద్ధిపై కేంద్రాన్ని వివరణ కోరిన ఎంపీ సానా సతీష్ బాబు

*ఏపీ తీర ప్రాంతాల్లో వరద నీటి నిర్వహణ, నగరాల అభివృద్ధిపై కేంద్రాన్ని వివరణ కోరిన ఎంపీ సానా సతీష్ బాబు*

 

*ఏపీలో డీప్‌ వాటర్ చమురు అన్వేషణ, తీరప్రాంత మౌలిక వసతులపై రాజ్యసభలో సానా సతీష్ బాబు ప్రశ్న*

 

*న్యూఢిల్లీ, జూలై 27(జిఎస్ బి వార్త)

:* ఆంధ్రప్రదేశ్‌లో డీప్‌వాటర్, అల్ట్రా డీప్‌వాటర్ చమురు, సహజవాయు అన్వేషణ ప్రాజెక్టులు, వాటి ద్వారా ఉపాధి అవకాశాలు, అలాగే తీరప్రాంత నగరాల్లో వరదనీటి నిర్వహణ, కాకినాడలో చేపట్టిన పరిశోధనలు, మౌలిక వసతుల అభివృద్ధిపై రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ సమాధానమిస్తూ, *ఆంధ్రప్రదేశ్ తీరంలోని కృష్ణా-గోదావరి (KG) బేసిన్‌లో తొమ్మిది డీప్‌వాటర్, అల్ట్రా డీప్‌వాటర్ అన్వేషణ, ఉత్పత్తి (E&P) బ్లాక్‌లు ప్రస్తుతం కార్యకలాపాల్లో ఉన్నాయని* వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు, స్థానిక నైపుణ్యాభివృద్ధి, తీర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని తెలిపింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక డీప్‌వాటర్ ఎనర్జీ హబ్‌గా అభివృద్ధి చేసే ప్రత్యేక పథకానికి ఇప్పటివరకు ఆమోదం ఇవ్వలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, *HELP విధానం* కింద కొనసాగుతున్న అన్వేషణ కార్యకలాపాల ద్వారా సముద్ర రవాణా, లాజిస్టిక్స్, ఫ్యాబ్రికేషన్, ఆఫ్‌షోర్ ఇంజినీరింగ్ రంగాలకు అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొంది.

 

మరో ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, *AMRUT 2.0* కింద ఆంధ్రప్రదేశ్‌లో *తీరప్రాంత నగరాల్లో 14 స్టార్మ్‌వాటర్ డ్రైనేజ్ ప్రాజెక్టులు* అమలులో ఉన్నాయని వెల్లడించింది. అలాగే *194 నీటి వనరుల పునరుద్ధరణ ప్రాజెక్టులు* కూడా చేపట్టినట్లు తెలిపింది.

 

కాకినాడలో వరద నీటి నిర్వహణపై జాతీయ జలవిజ్ఞాన సంస్థ (National Institute of Hydrology – NIH) భాగస్వామ్యంతో అధ్యయనాలు కొనసాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA), విజయవాడతో కలిసి *తీరప్రాంత నగరాల సమగ్ర డ్రైనేజ్, వరద నివారణ (CDFM) ప్రణాళిక* రూపొందించినట్లు పేర్కొంది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా *అర్బన్ స్టార్మ్‌ వాటర్ ఫ్లడ్ మేనేజ్‌మెంట్ మోడల్* రూపొందించినట్లు కేంద్రం వెల్లడించింది.