ఏపీ లో జలాల సంరక్షణకు కేంద్రం ప్రత్యేక చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా అక్విఫర్ మ్యాపింగ్ పూర్తి – వర్షపు నీటి సంరక్షణకు భారీ కార్యక్రమాలు:ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్నకు కేంద్రం వివరణ*
న్యూఢిల్లీ, ఆగస్టు 3(జిఎస్ బి వార్త)
ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ జలాల సంరక్షణ, అక్విఫర్ మ్యాపింగ్, వర్షపు నీటి సంరక్షణ చర్యలు, దీర్ఘకాలిక జల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కీలక వివరాలను వెల్లడించింది.కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ భూషణ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించిన వివరాలు వెల్లడిస్తూ.జాతీయ అక్విఫర్ మ్యాపింగ్ మరియు మేనేజ్‌మెంట్ కార్యక్రమం (NAQUIM) కింద ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1.42 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అక్విఫర్ మ్యాపింగ్ పూర్తయిందని తెలిపారు.
భూగర్భ జలాలపై శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా జల వనరుల నిర్వహణకు అవసరమైన అక్విఫర్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని కేంద్రం వెల్లడించింది.విశాఖపట్నం, విజయవాడ–అమరావతి, తిరుపతి వంటి పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి స్థానిక అవసరాలకు అనుగుణంగా భూగర్భ జలాల నిర్వహణకు సూచనలు చేసినట్లు పేర్కొంది.జల్ శక్తి అభియాన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 9 లక్షల వర్షపు నీటి సంరక్షణ, కృత్రిమ భూగర్భ జలాల రీఛార్జ్ పనులు చేపట్టినట్లు తెలిపింది. అలాగే జల్ సంచయ్ జన భాగీదారి కార్యక్రమం కింద 3.84 లక్షల కృత్రిమ భూగర్భ జలాల రీఛార్జ్, నీటి నిల్వ పనులు పూర్తయ్యాయని వెల్లడించింది. భూగర్భ జలాల వినియోగం, రీఛార్జ్, వర్షపు నీటి సంరక్షణ చర్యలకు అవసరమైన సాంకేతిక సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నామని, ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అవసరాలకు అనుగుణంగా జల వనరుల ప్రణాళికలు రూపొందిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది.