ప్రలోభాలు, ఒత్తిళ్లు, బెదిరింపులకు తలొగ్గకుండా నామినేషన్లు వేసి పోటీలో నిలిచిన అభ్యర్థులకు హృదయపూర్వక అభినందనలు
రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. నిబద్ధతతో నిలబడటమే నిజమైన నాయకత్వం: వంటెద్దు వెంకన్నాయుడు
అమలాపురం: మున్సిపల్ ఎన్నికల్లో ఏ ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకూడదన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు తమకు శిరోధార్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు పేర్కొన్నారు. పార్టీ అధికారంలో లేని ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని, ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా నామినేషన్లు వేసి ఎన్నికల బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో వార్డులను ఏకగ్రీవం చేసుకునేందుకు కొందరు నాయకులు ఆర్థికపరమైన ప్రలోభాలు, ఒత్తిళ్లు, బెదిరింపుల ద్వారా ప్రయత్నాలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అయినప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ధైర్యంగా పోటీలో కొనసాగడం పార్టీ పట్ల వారికున్న అంకితభావానికి, రాజకీయ నిబద్ధతకు నిదర్శనమన్నారు.
చరిత్రను మరిచిపోవద్దు.. రాజకీయాల్లో పరిస్థితులు శాశ్వతం కావు!
గత రాజకీయ పరిణామాలను ఒక్కసారి పరిశీలిస్తే 1983 నుంచి 2004 వరకు కాంగ్రెస్ పార్టీ మన ప్రాంతంలో ఎదుర్కొన్న పరిస్థితులు, 1995లో జరిగిన అప్పటి ఛైర్పర్సన్ ఎన్నికల పరిణామాలను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఒక్కోసారి రాజకీయ పార్టీలకు అనూహ్యమైన పాఠాలు నేర్పుతుందని పేర్కొన్నారు.
ప్రజారాజ్యం పార్టీ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న పరిస్థితులు, రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి వెనుకాడి కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన సందర్భాలు కూడా రాజకీయ చరిత్రలో ఉన్నాయని గుర్తుచేశారు. నేటి రాజకీయ పరిస్థితులను విమర్శించే వారు గతాన్ని కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
అధికారం లేకపోయినా ఆత్మగౌరవంతో పోరాటం.. అదే మా రాజకీయ నిబద్ధత!
రాజకీయాలు వైకుంఠపాళి ఆట వంటివని, అందులో గెలుపోటములు, ఎత్తుపల్లాలు సహజమని వెంకన్నాయుడు పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోవడం, అధికారం కోల్పోయినప్పుడు కుంగిపోవడం నిజమైన రాజకీయ నాయకత్వ లక్షణం కాదన్నారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పదవులు, అధికారం కంటే కార్యకర్తల నమ్మకం, ప్రజల ఆదరణ ముఖ్యమని స్పష్టం చేశారు.
ఎలాంటి ఆర్థిక బలాన్ని ఉపయోగించకుండా, ఆర్థికపరమైన ప్రలోభాలకు లొంగకుండా, అధికారంలో లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టగలగడం తనకు ఎంతో గర్వకారణమన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
గెలిచిన వారికి శుభాకాంక్షలు.. ఓడిన వారికి సగర్వ అభినందనలు!
అమలాపురం మున్సిపాలిటీలో విజయం సాధించిన కౌన్సిలర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్నికల్లో ఓటమి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభ్యర్థులు ఏమాత్రం నిరుత్సాహపడవద్దని కోరారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
పార్టీ కోసం కష్టకాలంలోనూ నిలబడిన ప్రతి ఒక్కరి సేవలను గుర్తుంచుకుంటామని, వారి నిబద్ధతకు తగిన గౌరవం ఉంటుందని పేర్కొన్నారు.
పదవులు శాశ్వతం కాదు.. అధికారం శాశ్వతం కాదు.. కానీ పార్టీ కోసం కష్టకాలంలో నిలబడిన వారి చరిత్ర మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది.
ఎప్పుడూ స్నేహపూర్వక రాజకీయాలను ఆహ్వానిస్తూ, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండే తనకు రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత ద్వేషం లేదని, అయితే పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల ఆత్మగౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని వంటెద్దు వెంకన్నాయుడు స్పష్టం చేశారు.
ఇట్లు..
వంటెద్దు వెంకన్నాయుడు
కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
