vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 4:26 am Posted by : వార్తా జిఎస్‌బి

కాకినాడను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం*   *తాగునీటి నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ.. అక్రమ నిర్మాణాలు, ఫ్లెక్సీల తొలగింపునకు ఆదేశాలు*

*కాకినాడను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం*

*తాగునీటి నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ.. అక్రమ నిర్మాణాలు, ఫ్లెక్సీల తొలగింపునకు ఆదేశాలు*

కాకినాడ సిటీ ఆగస్టు 12 జి ఎస్ బి వార్త

నగరంలో తాగునీటి సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు, అక్రమ నిర్మాణాలు, అనధికార ఫ్లెక్సీలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు.బుధవారం ఉదయం ఇంద్రపాలెం నుంచి ప్రధాననగర్ బ్రిడ్జి వరకు పర్యటించిన కమిషనర్ నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఇంద్రపాలెం దాటిన తరువాత ప్రధాననగర్ బ్రిడ్జి మధ్యలో అనధికారికంగా జరుగుతున్న నిర్మాణాన్ని గుర్తించి వెంటనే నిలిపివేయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాదని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని తొలగించాలని సూచించారు.వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, వేసవి ప్రభావం నేపథ్యంలో నగరంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. వాటర్ ట్యాంకులు, నీటి సరఫరా ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంజనీరింగ్ అధికారి తమ పరిధిలోని ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటిని పరిశీలించాలని, క్లోరినేషన్ స్థాయిని కూడా తనిఖీ చేయాలని సూచించారు.ఇతర ప్రాంతాల్లో జాండిస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తగా తాగునీటిని తప్పనిసరిగా కాచి తాగాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. నీటిని కాచి తాగడం ద్వారా నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు.నగరంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ, వీధుల పరిశుభ్రతను ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు సిబ్బంది పరిశీలించాలని ఆదేశించారు. చెత్త సేకరణ సక్రమంగా జరుగుతోందా, వీధుల్లో పారిశుధ్యం ఎలా ఉందనే అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. గతంలో చేపట్టిన డ్రైన్ల డీ-సిల్టేషన్‌లో భాగంగా ప్రధాన, మధ్యస్థ, చిన్న డ్రైన్లను శుభ్రం చేసినప్పటికీ, ఇంకా అసంపూర్తిగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని సూచించారు.నగరంలోని వీధి దీపాల సమస్యలపై కూడా తక్షణ స్పందన ఉండాలని కమిషనర్ ఆదేశించారు. ఎక్కడైనా బల్బులు లేదా వీధి దీపాలు వెలగకపోతే పురమిత్ర ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటు నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చినా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.నగరాన్ని ఫ్లెక్సీ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో టౌన్ ప్లానింగ్ విభాగంతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించినట్లు కమిషనర్ తెలిపారు. ప్రతి ప్లానింగ్ సెక్టార్ పరిధిలోని ప్రాంతాల్లో అనధికార ఫ్లెక్సీలు, బ్యానర్లను గుర్తించి సంబంధిత అధికారులు వాటిని తొలగించాలని ఆదేశించారు.స్టేడియం రోడ్డు, మదర్ థెరిసా సెంటర్, బస్‌స్టాండ్ ప్రాంతాల్లో అధికంగా ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లను కూడా తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు.నగరాన్ని పరిశుభ్రమైన, సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని కమిషనర్ తెలిపారు. ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా, తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ నగరపాలక సంస్థకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృద్వి చరణ్, ఉద్యానవన శాఖ ఏడి శ్రీనివాసరావు, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్తిబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు