**క్యాచ్ ది రైన్’ ర్యాలీతో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన ర్యాలీ*
*ప్రతి ఇంటిలో ఇంకుడు గుంట ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచాలి: కమిషనర్* *ఎన్.వి.వి. సత్యనారాయణ**
*కాకినాడ, జూలై 22:*
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు “క్యాచ్ ది రైన్” కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలో బుధవారం వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పించే భారీ ర్యాలీ నిర్వహించారు.
బుధవారం ఉదయం వాటర్ వర్క్స్ కార్యాలయం వద్ద ఉన్న విజేత షోరూమ్ సమీపంలో నుంచి ఈ అవగాహన ర్యాలీని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. నగరపాలక సంస్థ అధికారులు, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది, వివిధ శాఖల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్షపు నీటి సంరక్షణపై నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ, వర్షపు నీటిలో ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదని, దానిని వృథా చేయకుండా భూగర్భ జలాల్లోకి చేరేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంట (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్) ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించి భూగర్భ జలాల మట్టాన్ని పెంచవచ్చని తెలిపారు. దీనివల్ల భావితరాలకు తాగునీటి కొరత లేకుండా చేయవచ్చని పేర్కొన్నారు.
కోస్తా ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాల మట్టం తగ్గుతున్న నేపథ్యంలో వర్షపు నీటి సంరక్షణను ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. పచ్చదనం పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలని, పరిశుభ్రమైన పరిసరాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
గురువారం మదర్ థెరిసా విగ్రహం వద్ద నుంచి “పచ్చదనం–పరిశుభ్రత” అంశంపై మరో అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. భవన నిర్మాణ అనుమతుల మంజూరు సమయంలో ఇంకుడు గుంట నిర్మాణాన్ని తప్పనిసరి చేసేలా టౌన్ ప్లానింగ్ విభాగానికి సూచనలు ఇస్తామని తెలిపారు.
“చేతులు కలుపుదాం… భూగర్భ జలాలను పెంచుదాం… ప్రతి నీటి బొట్టును సంరక్షించి భావితరాలకు అందిద్దాం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఇంటి ఈశాన్య మూలలో ఇంకుడు గుంట ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్.ఈ.) పి. వెంకట్రావు మాట్లాడుతూ, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును సంరక్షించడం అత్యవసరమని తెలిపారు. అరట్లకట్ట, సామర్లకోట వద్ద ఉన్న రెండు నిల్వ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపామని, నగరానికి తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన “క్యాచ్ ది రైన్” కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కనకారావు, మాచరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.