ఐ.పోలవరం, అక్టోబర్ 3 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి సుమారు 180 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్ను అభినందిస్తూ శాంతినికేతన్ స్కూల్‌లో ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. “జైహింద్.. జై భారత్.. జై స్మిత్” అంటూ నినాదాలు చేస్తూ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను కొనియాడారు.
స్కూల్ అధినేత గోకవరపు వెంకట్రాజు, వి.వి.ఆర్. మాట్లాడుతూ.. స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన ధైర్యం, సమయస్ఫూర్తి, బాధ్యతాభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ధైర్యసాహసాలను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు.
ప్రతి విద్యార్థి స్మిత్ మచ్చర్‌ను స్ఫూర్తిగా తీసుకుని కష్టసమయాల్లో ధైర్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించే గుణాలను పెంపొందించుకోవాలని సూచించారు. దేశభక్తి, మానవతా విలువలు, ధైర్యసాహసాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.


