డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పర్యవేక్షణలో, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ యువజన, విద్యార్థి రంగాలు సంయుక్తంగా కాకినాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి.ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షలు, నియామక ప్రక్రియలో తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే, కేవలం కొన్ని పోస్టులకు మాత్రమే పారదర్శకత లేకుండా నియామక పత్రాలు అందజేశారని, దీనివల్ల అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో సచివాలయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ‘సూపర్ సిక్స్’ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని నాయకులు విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకపోవడం, ఇంగ్లీష్ మీడియం బోధనపై సరిగ్గా దృష్టి సారించకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆర్థికంగా నలిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తొలి రోజు దీక్షను ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ అధినేత ద్వారంపూడి వీరభద్రారెడ్డి దీక్షాశిబిరానికి చేరుకుని, పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పృథ్వి, సెక్రటరీ మల్ల కిషోర్, నగర అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న సాగర్, మహిళా నాయకురాలు రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్ తో పాటు పలు విభాగాల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు ,వార్డు ఇన్‌చార్జులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.