కోనసీమ: అమలాపురం అక్టోబర్ 31 ( జీఎస్. బి వార్త)అర్నాబ్ తుఫాను సృష్టించిన బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు, సామాన్య ప్రజలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, మండపేట నియోజకవర్గ పరిశీలకుడు వంటెద్దు వెంకన్నాయుడు డిమాండ్ చేశారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
తుఫాను ప్రభావంతో వరి, కొబ్బరి, అరటి తదితర పంటలతో పాటు వివిధ ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతులు చేతికొచ్చిన పంటను కోల్పోయి ఆర్థికంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాల వారీగా క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలను పారదర్శకంగా అంచనా వేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా నష్టపరిహారాన్ని నేరుగా బాధిత రైతులకు అందించాలని డిమాండ్ చేశారు.
అలాగే తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్లు, వ్యాపార సంస్థలను కూడా అధికారులు పరిశీలించాలని, నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి తగిన పరిహారం అందించాలని కోరారు.
రైతులకు పంటల బీమా భరోసా కల్పించాలి
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులకు బీమా భరోసా కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా వెంకన్నాయుడు గుర్తుచేశారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం, నీటి ఎద్దడి, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటల బీమా సదుపాయం అందుబాటులో ఉంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు ఎంతో ఆర్థిక భరోసా లభించేదని అన్నారు.
పంటల బీమా అమలు, ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, రైతులను నిర్లక్ష్యం చేయకుండా వారికి అండగా నిలవాలని కోరారు.
ఐదు రోజులుగా విద్యుత్ లేక ప్రజల ఇక్కట్లు
తుఫాను ప్రభావంతో పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంకన్నాయుడు తెలిపారు. విద్యుత్ లేక తాగునీరు, నిత్యావసర పనులకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల దైనందిన జీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు.
విద్యుత్ శాఖ అధికారులు మరమ్మతు పనులను వేగవంతం చేసి యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
రైతుల కష్టాలను, ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి తక్షణమే స్పందించాలని, పంట నష్టపరిహారం, ఇళ్ల నష్టపరిహారం, విద్యుత్ పునరుద్ధరణ వంటి అంశాల్లో కాలయాపన చేయకుండా బాధితులకు న్యాయం చేయాలని వంటెద్దు వెంకన్నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.
