- పల్లెబాట–ఈగల్ కార్యక్రమంలో డ్రగ్స్, గంజాయిపై విద్యార్థులకు విస్తృత అవగాహన
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారుల పిలుపు
అడ్డతీగల,(జిఎస్ బి వార్త)జూలై 27:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న చర్యల్లో భాగంగా,ఐజీపీ ఆకే రవికృష్ణ ఆదేశాల మేరకు పోలవరం జిల్లాలోని అడ్డతీగల ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు అనూప్ జూనియర్ కళాశాలల్లో “పల్లెబాట–ఈగల్” కార్యక్రమం లో భాగంగా డ్రగ్స్,గంజాయి నివారణపై విస్తృత అవగాహన సదస్సును అడ్డతీగల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.గజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈగల్ విభాగం అధికారులు విద్యార్థులకు మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే తీవ్ర పరిణామాలపై సమగ్రంగా వివరించారు. గంజాయి,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు కుటుంబం, సమాజం,భవిష్యత్తు మరియు విద్యార్థుల కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు.అలాంటి అలవాట్లు నేరచరిత్రకు దారితీసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.
విద్యార్థులకు ఆపరేషన్ చైతన్యం,ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్,జాయింట్ ట్రైన్ ఆపరేషన్,ఆపరేషన్ వజ్ర ప్రహార్ వంటి ఈగల్ విభాగం చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాల లక్ష్యాలు,వాటి ద్వారా మాదకద్రవ్యాల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలను వివరించారు.గంజాయి ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అధికారులు స్పష్టం చేశారు.దేశానికి యువతే గొప్ప బలమని, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని,దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అనూప్ కళాశాల కరస్పాండెంట్ చీకట్ల ఆశీర్వాదం,ఈగల్ ఇన్‌స్పెక్టర్ పి.వి.సూర్యమోహన్ రావు,అడ్డతీగల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.గజేంద్ర కుమార్,ఎస్‌ఐ బి.వినోద్,ఈగల్ టీమ్ సభ్యులు హెడ్ కానిస్టేబుల్ మధు, వీరబాబు,రాజు,పోలీసు సిబ్బంది,ప్రభుత్వ కళాశాల,అనూప్ కళాశాల బోధనా సిబ్బంది పాల్గొన్నారు.