vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 10:02 am Posted by : వార్తా జిఎస్‌బి

పారదర్శకంగా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేయాలి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

ఐ. పోలవరం, ఆగస్టు 29 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు): కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పూర్తి పారదర్శకతతో అమలు చేయాలని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అధికారులను ఆదేశించారు.

భూముల రీ-సర్వే కార్యక్రమం అమలులో భాగంగా శనివారం రీ-సర్వే ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అమలాపురం ఆర్డీవో సరళాదేవి హాజరయ్యారు. రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు మరియు సిబ్బందితో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు రీ-సర్వే కార్యక్రమం పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రీ-సర్వే నిర్వహించే సమయంలో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన, సమాచారం కల్పించాలని సూచించారు. రీ-సర్వే ప్రక్రియపై రైతులకు తలెత్తే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులకు తెలిపారు.

రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సున్నితంగా వ్యవహరించాలని, రీ-సర్వే ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అవసరమైన అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, నిర్ణీత విధానాల ప్రకారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రీ-సర్వే కార్యక్రమం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమర్థవంతంగా సాగాలని, ప్రతి దశలో అధికారుల మధ్య సమన్వయం ఉండాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సూచించారు.

ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ, దేవాదాయ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.