vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 12:50 pm Posted by : వార్తా జిఎస్‌బి

పెదలంక డ్రైనేజీ సమస్యపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చిన్నపాటి వర్షానికే రహదారులపై నీరు.. శాశ్వత పరిష్కారం చూపాలని వినతి

ఐ.పోలవరం, అక్టోబర్ 5 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): పెదలంక గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యపై గ్రామానికి చెందిన జనిపెల్లి సుమన్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో చిన్నపాటి వర్షం కురిసినా రహదారులపై నీరు నిలిచిపోతుండటంతో పాటు, మురుగునీరు రోజుల తరబడి తొలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు, మురుగునీరు రహదారులపై నిలిచిపోతున్నాయని తెలిపారు. దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతో పాటు పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

పెదలంక గ్రామంలో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జనిపెల్లి సుమన్ అధికారులను కోరారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.