Date of Publish : 07 August 2026, 8:38 amPosted by : వార్తా జిఎస్‌బి
ప్రతిపక్షాల ధర్నాలు కాలక్షేపానికే: టిడిపి మహిళా నాయకురాలు డా. రాయవరపు సత్యభామ మండిపాటు
రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేపడుతున్న ధర్నాలు, ఆందోళనలు కేవలం కాలక్షేపానికేనని, ఉనికిని కాపాడుకోవడానికే తప్ప ప్రజల కోసం కాదని టిడిపి మహిళా నాయకురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని సత్యభామ తెలిపారు. రాజధాని అమరావతిని స్వర్గసీమగా తీర్చిదిద్దడంతో పాటు, ఒకప్పుడు బస్సులు కూడా వెళ్లలేని భోగాపురం వంటి సుదూర ప్రాంతాలకు సైతం విమానాశ్రయం వంటి ప్రాజెక్టులతో అభివృద్ధిని చేరువ చేసిందని గుర్తుచేశారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని, ప్రభుత్వంపై విమర్శలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడమే పనిగా పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. “ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు, ధైర్యం ప్రతిపక్షాలకు ఉండాలి. కానీ, కేవలం సెంట్రల్, చీరలు, జాకెట్లు, మహిళల దుస్తుల గురించి మాట్లాడుతున్నారంటే వారి సంస్కారం ఏంటో అర్థమవుతోంది” అని సత్యభామ ఆవేదన వ్యక్తం చేశారు.పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులతో ప్రవర్తిస్తున్న తీరును, మైకులు లాక్కునే సంస్కృతిని ఆమె తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ నాయకులు తమను అణచివేస్తున్నారంటూ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి నాయకులు, మహిళలు ఓపికతో వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు. తమ ఓపికను చేతకానితనంగా భావిస్తే సహించేది లేదని, ప్రతిపక్షాలు ఇకనైనా చెత్త రాజకీయాలు మాని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని హెచ్చరించారు.