vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 4:24 am Posted by : వార్తా జిఎస్‌బి

బాధితుల కడుపు కొడుతున్న రేషన్ డీలర్లు!* *తుఫాను సాయంపై ‘పౌరసరఫరాల’ దగా.. రెవెన్యూ నిద్రమత్తు!* *కాగితాల్లో ఘనమైన లెక్కలు.. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు మొండిచేయి* *కాకినాడ రూరల్‌లో వెలుగుచూస్తున్న పక్కదారి దందా!* ​

కాకినాడ రూరల్ నవంబర్ 3 జి ఎస్ బి వార్త

​ప్రకృతి విలయతాండవం చేసి సర్వస్వం కోల్పోయిన పేదల ఆక్రందనలు ఒకవైపు.. వారి ఆకలి కేకలను సైతం సొమ్ము చేసుకుంటున్న అవినీతి తిమింగళాల దందా మరోవైపు! తుఫానుల ధాటికి ఇళ్లు మునిగి, పనుల్లేక పస్తులుంటున్న నిరుపేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం కేటాయించిన ఉచిత నిత్యావసర సరుకులు, పరిహారం బాధితులకు చేరకుండా మధ్యలోనే మాయమవుతున్నాయి. కాకినాడ రూరల్ మండలంలో రేషన్ డీలర్లు, కొందరు అధికారుల అండదండలతో సాగిస్తున్న ఈ దందా ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారింది.
​ *డీలర్ల ‘తూకం’ మోసం.. బస్తాల్లో భారీగా కోతలు!*
​ప్రభుత్వ నిబంధనల ప్రకారం తుఫాను బాధితుల్లో మత్స్యకారులకు 50 కిలోల బియ్యం, ఇతర ప్రభావిత కుటుంబాలకు 25 కిలోల బియ్యంతో పాటు కందిపప్పు, వంటనూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపల కిట్లను పూర్తి ఉచితంగా అందించాలి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది.
​ 50 కిలోల బియ్యం ఇవ్వాల్సిన చోట 35 నుంచి 40 కిలోలు మాత్రమే చేతిలో పెడుతున్నారు. మిగిలిన నిత్యావసర కిట్లలో పప్పు, నూనెలను సైతం తగ్గించి పంపిణీ చేస్తున్నారు.
​ “సర్వర్ డౌన్ అయింది”, “లింక్ పనిచేయడం లేదు”, “మీ రేషన్ కార్డు మ్యాప్ కాలేదు” అంటూ బాధితులను రోజుల తరబడి తిప్పుకుంటున్నారు. తీరా చూస్తే బాధితుల ప్రమేయం లేకుండానే పోర్టల్‌లో సరుకులు డ్రా అయినట్లు నమోదవుతుండటం గమనార్హం. బాధితుల పేరిట మిగిల్చిన బియ్యం, నిత్యావసరాలను చీకటి పడగానే అక్రమంగా రైస్ మిల్లులకు, హోటళ్లకు, బహిరంగ మార్కెట్లకు తరలించి లక్షలాది రూపాయలు గడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
​ *పర్యవేక్షణ గాలికొదిలేసిన రెవెన్యూ, సివిల్ సప్లైస్ యంత్రాంగం!*
​సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన విలేజ్ రెవెన్యూ అధికారులు (VROలు), పౌరసరఫరాల శాఖ తనిఖీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
​డీలర్ల దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లను, పంపిణీ రికార్డులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాల్సిన అధికారులు అసలు గ్రామాల వైపే కన్నెత్తి చూడటం లేదు.
​నెల రోజుల వ్యవధిలోనే రెండు తుఫానుల ప్రభావంతో కాకినాడ తీర ప్రాంత ప్రజలు చిన్నాభిన్నమయ్యారు. ఇప్పుడు మరో తుఫాను ముప్పు పొంచి ఉందన్న వార్తలతో ప్రజలు వణికిపోతున్నారు. ఇలాంటి అత్యవసర సమయంలో కూడా అధికారుల నిర్లక్ష్యం బాధితులకు శాపంగా మారింది.
​ *ఎమ్మెల్యే కల్పించుకోరా? అధికారులపై చర్యలు ఏవీ?*
​కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇంత బహిరంగంగా డీలర్ల మాఫియా పేదల సరుకులను దోచుకుంటున్నా స్థానిక శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) మౌనం వహించడంపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
​ప్రజాప్రతినిధులు వెంటనే రంగంలోకి దిగి పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించాలి.మండలంలో ఉన్న ప్రతి రేషన్ దుకాణంలో స్టాక్ ఆడిట్ నిర్వహించి, అక్రమాలకు పాల్పడిన డీలర్ల లైసెన్సులను తక్షణమే రద్దు చేయాలి.​అర్హుల జాబితాల్లో పేర్లు గల్లంతైన ప్రతి బాధితుడికీ తిరిగి న్యాయం జరిగేలా పారదర్శక పద్ధతిలో సహాయం అందించాలి.ప్రభుత్వ సాయంపేదవాడిచేతికిచేరకుండాదళారులజేబుల్లోకివెళ్తుంటేఇకసంక్షేమానికిఅర్థమేముంటుందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.