ఐ. పోలవరం, అక్టోబర్ 30: వరుస తుఫాన్ల దెబ్బకు తీరప్రాంత గ్రామమైన భైరవపాలెం–తీర్థాలమొండి ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. తుఫాన్ బీభత్సం నుంచి ఇంకా కోలుకోకముందే కనీస మౌలిక సదుపాయాలు కరువవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా లేక గ్రామమంతా అంధకారంలో ఉండగా, మరోవైపు ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. తమ కష్టాలను అధికారులు పట్టించుకోవాలని గ్రామ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు కన్నీటి విన్నపం చేస్తున్నారు.
ఐదు రోజులుగా కరెంటు లేదు.. చీకట్లోనే జీవనం!
గ్రామంలో గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చీకట్లోనే గడపాల్సిన పరిస్థితి నెలకొందని, తాగునీరు సహా రోజువారీ అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
సముద్ర వేటకు దూరం.. మత్స్యకార కుటుంబాలకు పూటగడవని పరిస్థితి!
తుఫాన్ ప్రభావంతో గత వారం రోజులుగా సముద్రంలో చేపల వేటకు వెళ్లలేక మత్స్యకారులు ఉపాధి కోల్పోయారు. రోజువారీ వేటపైనే ఆధారపడి జీవించే కుటుంబాలు ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా స్పందించి మత్స్యకార కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం, నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉచిత బియ్యం పంపిణీలో తమ గ్రామానికి అన్యాయం జరిగిందా?
గత నెలలో వచ్చిన తుఫాన్ సమయంలో తీరప్రాంత గ్రామాలకు ఉచిత బియ్యం పంపిణీ చేసినప్పటికీ, భైరవపాలెం గ్రామానికి మాత్రం ఇప్పటివరకు బియ్యం అందలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఆర్నబ్ తుఫాన్‌తో ఇబ్బందులు మరింత పెరిగిన నేపథ్యంలో గత నెలకు సంబంధించిన బియ్యంతో పాటు ప్రస్తుత తుఫాన్ సహాయక బియ్యం, నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలని కోరుతున్నారు.
ఆర్నబ్ తుఫాన్ బీభత్సం.. దెబ్బతిన్న గుడిసెలు, రేకుల షెడ్లు!
నాలుగు రోజుల క్రితం వచ్చిన ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో గ్రామంలోని పూరిగుడిసెలు, రేకుల షెడ్లు తీవ్రంగా దెబ్బతిని కొన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయని బాధితులు తెలిపారు. ఇళ్లు దెబ్బతిని నిరాశ్రయులైన కుటుంబాలకు ఇప్పటివరకు తగిన సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాలను తక్షణమే అంచనా వేసి బాధితులకు ప్రభుత్వ పరిహారం అందించాలని కోరుతున్నారు.
వరద నీటితో గ్రామం.. పేరుకుపోయిన చెత్త.. పొంచి ఉన్న ఆరోగ్య సమస్యలు!
గ్రామం వరద నీటిలో మునిగిపోవడంతో వీధుల్లో చెత్త పేరుకుపోయిందని, మూడు రోజులుగా పారిశుధ్య సిబ్బంది గ్రామానికి రాకపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని గ్రామస్తులు చెబుతున్నారు. తక్షణమే చెత్తను తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు వైద్య సిబ్బందితో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కలెక్టర్ గారూ.. మా గ్రామం వైపు ఒక్కసారి చూడండి!
విద్యుత్ లేక చీకట్లో, ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల్లో, తుఫాన్ నష్టాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని భైరవపాలెం–తీర్థాలమొండి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి గ్రామంలో పర్యటించి సమస్యలను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
విద్యుత్ పునరుద్ధరణ, ఉచిత బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ, మత్స్యకారులకు నష్టపరిహారం, ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు ఆర్థిక సహాయం, పారిశుధ్య చర్యలు, వైద్య శిబిరం ఏర్పాటు వంటి అత్యవసర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
“మహాప్రభో.. మా గ్రామాన్ని ఆదుకోండి. తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం. కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నాం. మా బాధలను అర్థం చేసుకుని తక్షణమే ప్రభుత్వ సహాయం అందించండి” అంటూ భైరవపాలెం–తీర్థాలమొండి గ్రామ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్‌కు శిరస్సు వంచి వేడుకుంటున్నారు.
– రిపోర్టర్: వేణు కాశి జీఎస్బీ వార్త | ఐ. పోలవరం