vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 6:03 pm Posted by : వార్తా జిఎస్‌బి

రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రి 100 పడకలతో నూతన భవన ప్రారంభం*

 

  • రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రి 100 పడకలతో నూతన భవన ప్రారంభం*

 

*కార్మికులకు అత్యాధునిక సౌకర్యాల ఆసుపత్రి*

 

*కార్మికుల సంక్షేమానికి, భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత*

*రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్*

 

*రాజమహేంద్రవరం:*

రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకల అత్యాధునిక ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం కార్మికులకు ఎంతో ఉపయోగపడే ముందడుగని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.

మంగళవారం సాయంత్రం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు.

 

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ నూతన ఓపీడీ బ్లాక్‌ను కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం ప్రారంభించారు. అనంతరం అదే వేదిక నుంచి దేశవ్యాప్తంగా నిర్మించిన ఆరు ఈఎస్ఐ భవనాలలో భాగంగా రాజమహేంద్రవరం ఇ ఎస్ ఐ భవనాన్ని కూడా ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ నూతన ఆసుపత్రి ద్వారా రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాల కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో సుమారు రూ.75 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాయన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. నూతన కార్మిక చట్టాల అమలుతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అవసరమైన మేరకు వైద్యుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

 

అనంతరం కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వర్చువల్‌గా మాట్లాడుతూ, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో కార్మికులు, యువత కీలక శక్తులని పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర అమూల్యమని, వారి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈఎస్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన వైద్య సదుపాయాల ద్వారా దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు.

 

సామాజిక భద్రత, మెరుగైన ఉపాధి అవకాశాలు, నాణ్యమైన వైద్య సేవలు అందించడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళల ఉపాధి భాగస్వామ్యం పెరుగుతోందని, వారికి సమాన పనికి సమాన వేతనం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

ఈఎస్ఐసీ జోనల్ మెడికల్ కమిషనర్ డాక్టర్ అషిత్ ముల్లిక్ మాట్లాడుతూ, సుమారు రూ.70 కోట్ల వ్యయంతో 13,376 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గ్రౌండ్‌తో పాటు రెండు అంతస్తుల్లో ఆసుపత్రి భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. 26 ప్రత్యేక ఔట్‌పేషెంట్ విభాగాలు, మూడు ఆధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, అత్యవసర ఆపరేషన్ థియేటర్, సమగ్ర ఐసీయూ, శస్త్రచికిత్సల ముందు, అనంతర వార్డులతో కూడిన అత్యాధునిక వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ డైరెక్టర్ వి. ఆంజనేయులు, ఈఎస్ఐసీ రీజనల్ డైరెక్టర్ ఎం. రామారావు, నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ కోటేశ్వరరావు, ఈఎస్ఐసీ జాయింట్ డైరెక్టర్ ప్రణవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.