vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 3:46 am Posted by : వార్తా జిఎస్‌బి

స్వచ్ఛ కాకినాడ’ మనందరి బాధ్యత* : *కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ* ​ *పారిశుద్ధ్య పర్యవేక్షణకు వార్డు ప్రత్యేక అధికారులు* *​కాలువల్లో ప్లాస్టిక్ వేస్తే కఠిన చర్యలు.. వ్యాపారులకు హెచ్చరిక* ​ *వర్షాల నేపథ్యంలో ముందస్తు సహాయక చర్యలు*

కాకినాడ సిటీ అక్టోబర్ 23 జి ఎస్ బి వార్త
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అధికారుల నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ‘స్వచ్ఛ కాకినాడ’ సాధ్యమవుతుందని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ స్పష్టం చేశారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారులను (స్పెషల్ ఆఫీసర్లు) నియమించినట్లు తెలిపారు.పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ పూడికతీత, వీధి దీపాల వంటి సమస్యలపై ప్రజలు గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచిన ప్రత్యేక అధికారుల నంబర్లకు ఫోన్ చేసి గానీ, ‘పురమిత్ర’ యాప్ ద్వారా గానీ నేరుగా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. క్షేత్రస్థాయి పనుల పురోగతిపై ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పారవేయడం వల్ల నీటి ప్రవాహం నిలిచిపోతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపార సంస్థలు, టీ దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై, మురుగు కాలువల్లో చెత్త వేస్తే కఠిన చర్యలతో పాటు భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు.రానున్న భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగాల సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీల పూడికతీతను వేగవంతం చేశామని, అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల వద్ద చెత్త తొలగింపు చర్యలు చేపట్టామన్నారు. ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రమాదకరంగా ఉన్న ఎండిన చెట్లు, కొమ్మలను హార్టికల్చర్ విభాగం ద్వారా తొలగిస్తున్నట్లు వివరించారు. మరోవైపు నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు జగన్నాథపురం తదితర ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు పేర్కొంటూ.. నగరాన్ని స్వచ్ఛంగా, సుందరంగా ఉంచేందుకు పౌరులంతా సహకరించాలని కోరారు.