vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 12:23 pm Posted by : వార్తా జిఎస్‌బి

హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి భారత రిపబ్లిక్ పార్టీ డిమాండ్

ఐ. పోలవరం మండలం, ఆగస్టు 31 (జీఎస్‌బీ వార్త రిపోర్టర్ వేణు కాశి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానించే విధంగా ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ, దీనికి బాధ్యుడిగా పేర్కొంటున్న హమారా ప్రసాద్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని భారత రిపబ్లిక్ పార్టీ డిమాండ్ చేసింది.

భారత రిపబ్లిక్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చీకురుమెల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కాశి సిద్ధార్థ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ భారత దేశ పరిపాలన మొత్తం భారత రాజ్యాంగం ఆధారంగానే కొనసాగుతోందన్నారు. దేశంలోని చట్టాలు, పాలనా వ్యవస్థ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే అమలవుతున్నాయని పేర్కొన్నారు.

అటువంటి మహోన్నత భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై అవమానకరంగా, అభ్యంతరకరంగా వ్యాఖ్యానిస్తూ “కల్పిత నాయకుడు” అనే పేరుతో పుస్తకాన్ని ముద్రిస్తున్నారని వారు ఆరోపించారు. ఇది రాజ్యాంగ నిర్మాత పట్ల అవమానకరమైన చర్య అని పేర్కొన్నారు.

జాతీయ గీతం లేదా జాతీయ పతాకాన్ని అవమానించినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకునే నిబంధనలు ఉన్నాయని, అదే విధంగా దేశానికి విశేష సేవలందించిన జాతీయ నాయకులను అవమానించే చర్యలపై కూడా సంబంధిత అధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌పై బురదజల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన భారత రిపబ్లిక్ పార్టీ నాయకులు, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణల్లో నిజానిజాలు నిర్ధారించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.

అంబేద్కర్‌ను అవమానించే ఎలాంటి చర్యలనైనా భారత రిపబ్లిక్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని వారు స్పష్టం చేశారు.