ఐ. పోలవరం, ఆగస్టు 29 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు): మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన “స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు” 2025–26 సంవత్సరానికి గాను జి. వేమవరం ఉన్నత పాఠశాల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది.
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 పాఠశాలలు పోటీపడగా, జి. వేమవరం ఉన్నత పాఠశాల అత్యుత్తమ క్రీడా ప్రతిభను కనబరిచి 282 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది.
ఈ ప్రతిష్టాత్మక అవార్డును జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.కె. మెహబూబ్ భాషా గారు, ఏపీసీ మమ్మీ గారు చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మట్టపర్తి శ్రీనివాసరావు గారు, పాఠశాల పీడీలు జి. కళావతి గారు, ఎ.ఎన్. రాంప్రసాద్ గారు అందుకున్నారు.
అవార్డు సాధించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీడీలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారు, శాసన మండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్ గారు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బసవ అప్పారావు గారు, జి. వేమవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు పెంట రవి ప్రసాద్ గారు అభినందించారు.
అలాగే ఎంపీటీసీలు లంకలపల్లి దుర్గారాణి గారు, జ్యోతి నాయుడు గారు, మద్దింశెట్టి పురుషోత్తం గారు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు ఈ ఘన విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం జి. వేమవరం ఉన్నత పాఠశాల క్రీడా రంగంలో సాధిస్తున్న ప్రగతికి నిదర్శనమని పలువురు పేర్కొన్నారు.