రాష్ట్రంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 44.8 శాతానికి చేరింది: ఎంపీ సానా సతీష్ బాబు ప్రశ్నకు కేంద్రం వివరణ*
న్యూఢిల్లీ, జూలై 23:(జిఎస్ బి వార్త)
ఆంధ్రప్రదేశ్లో మహిళల ఉపాధి భాగస్వామ్యం,, నైపుణ్యాభివృద్ధి, స్వయం సహాయక సంఘాల పాత్ర, మహిళల సాధికారత కోసం కేంద్రం చేపడుతున్న చర్యలపై రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
దీనికి సమాధానంగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS)-2025 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (LFPR) 2021-22లో 43.3 శాతం ఉండగా, 2023-24 నాటికి 44.8 శాతానికి పెరిగిందని, 2025లో కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. అలాగే మహిళల వర్కర్ పాప్యులేషన్ రేషియో (WPR) 2021-22లో 41.8 శాతం నుంచి 2023-24లో 43.1 శాతానికి పెరిగినట్లు తెలిపింది.
మహిళల ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు స్కిల్ ఇండియా మిషన్, PMKVY, JSS, NAPS, CTS, FutureSkills PRIME వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే ELI పథకం, నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) పోర్టల్ ద్వారా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి సేవలు అందిస్తున్నట్లు తెలిపింది.
అదేవిధంగా, సమాన పనికి సమాన వేతనం, ప్రసూతి ప్రయోజనాలు, కార్యాలయాల్లో మహిళల భద్రత, రాత్రి వేళల్లో కూడా తగిన భద్రతతో ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త కార్మిక చట్టాల్లో నిబంధనలు తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మహిళల సాధికారత కోసం ‘Women-led Development’ దిశగా చర్యలు చేపడుతున్నామని, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు, క్రెచ్లు ఏర్పాటు వంటి చర్యలు కూడా అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

