- బలబద్రపురంలో రైతన్న మీకోసం కార్యక్రమం
అనపర్తి ఆగస్టు 7 ( జి ఎస్ బి వార్త ) రైతన్న మీకోసం కార్యక్రమం ఎల్ నినోప్రభావం – నివారణ కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా
శుక్రవారం బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అని మండల వ్యవసాయ అధికారి జి.వాణి తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనపర్తి సహాయ వ్యవసాయ సంచాలకులు డివి కృష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పసిఫిక్ మహాసముద్రంలో మరియు తూర్పు భాగంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు ఒకటి నుండి మూడు డిగ్రీల మేర పెరగడం వలన ఏర్పడే అసహజ వాతావరణ పరిణామాలను ఎల్ నినో గా పిలుస్తారు
.ప్రస్తుత వాతావరణ అంచనాలు ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎన్నెన్నో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయి. దీని ప్రభావం వలన మన రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవడం జరుగుతుందని, ఇలాంటి ప్రతికూల ప్రభావాలు చూపించనున్నాయని వాతావరణ శాఖ ముందస్తు అంచనాల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ప్రత్యామ్నాయ పంటలను లేదా తక్కువ కాలపరిమితి గల రకాలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. నీటిని చాలా జాగ్రత్తగా సాగు కోసం మాత్రమే ఉపయోగించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించూసుకోవాలని రైతులకు సూచించారు. ప్రత్యేక అతిధి గా విచ్చేసిన డిఆర్సి సహాయ వ్యవసాయ సంచాలకులు కె. జయ రామలక్ష్మి మాట్లాడుతూ రైతన్న మీకోసం కార్యక్రమంలో ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలోని రైతన్న మీకోసం కమిటీ వారు ప్రతి రైతును ప్రతి వ్యవసాయ భూకమతాన్ని సందర్శించి ప్రస్తుత పంట పరిస్థితి నీటి కొరత వలన పంటవాడిపోవడం లేదా ఎండిపోవడం చీడపీడలు, ఉధృతి ,ఉద్యాన పంటల పరిస్థితి బీడు లేదా సాగు చేయని భూమి వివరాలు వంటి అంశాలను అంచనా వేస్తారన్నారు.ఈ కమిటీలో గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా ఉద్యాన వ్యవసాయ సహాయకులు మరియు నీటి సంఘ సభ్యులు లేదా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యులు మరియు ఇద్దరు అభ్యుదయ రైతులు కమిటీగా ఉంటారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రతి భూకమతాన్ని రైతన్న మీకోసం కమిటీ పర్యవేక్షించి సూచనలు సలహాలు వెంటనే రైతుకు అందించడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం క్షేత్ర పర్యటన నిర్వహించి డ్రోన్ స్ప్రేయింగ్ విధానాన్ని పరిశీలించారు.ఈ విధానంలో ఉపయోగాల గురించి రైతులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఈఓ కే శ్రీనివాస్ గ్రామ ఉద్యాన సహాయకులు శరత్ తేజ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
