నిస్వార్థ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం సొంత నిధులతో పార్టీ కార్యాలయం నిర్మించిన సూర్యవర్మ సేవలు అభినందనీయం – ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు

    Date:

    📰 Generate e-Paper Clip

    ఐ. పోలవరం ( జియస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి) నిస్వార్థంగా ప్రజలకు  సేవలందించే కార్యకర్తలు ఉండటమే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) అన్నారు.
    ఐ. పోలవరం మండలం కొమరిగిరి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెన్మెత్స సూర్యవర్మ, పార్టీపై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుతూ తన సొంత 20 సెంట్ల స్థలంలో సుమారు రూ.5 లక్షల వ్యయంతో నూతనంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. అదే ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం, పార్టీ పతాక స్థూపాలను కూడా ఏర్పాటు చేశారు.
    ఈ నూతన పార్టీ కార్యాలయం, ఎన్టీఆర్ విగ్రహం, పార్టీ పతాక స్థూపాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పాల్గొని వాటిని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సూర్యవర్మ సొంత నిధులతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు.
    నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ఉండటం సాధారణ విషయమేనని, అయితే ఒక గ్రామ స్థాయిలో పార్టీపై ఉన్న అభిమానంతో సొంత స్థలాన్ని కేటాయించి, సొంత నిధులతో కార్యాలయాన్ని నిర్మించడం ఎంతో విశేషమన్నారు. సూర్యవర్మ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
    త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఒకే చోట సమావేశమై పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకోవడానికి ఇటువంటి కార్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యకర్తల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి ఇవి దోహదపడతాయని అన్నారు.
    రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమ లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల మద్దతు లభిస్తోందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి మరింత బలం చేకూర్చాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
    కొమరిగిరి గ్రామంలో సూర్యవర్మ ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయం గ్రామస్థాయి కార్యకర్తలకు ఒక వేదికగా నిలిచి పార్టీ కార్యక్రమాల నిర్వహణకు కేంద్రంగా ఉపయోగపడుతుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.
    ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అశోక్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!