ముమ్మిడివరం: సెప్టెంబర్ 02 ( జియస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి) బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి హోదాలో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీ నాయకుడిలా వ్యవహరించారని ఆరోపిస్తూ, ముమ్మిడివరం మున్సిపల్ కమిషనర్ పి. రవివర్మపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ డిమాండ్ చేశారు.
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి. రవివర్మ పాల్గొని, “OG” గెటప్‌లో కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారని కాశి రామకృష్ణ ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు నిష్పాక్షికంగా సేవలు అందించాల్సిన అధికారి, రాజకీయ కార్యక్రమంలో ఒక పార్టీ కార్యకర్త మాదిరిగా పాల్గొనడం సివిల్ సర్వీస్ ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందుతూ ప్రజాసేవ చేయాల్సిన అధికారి రాజకీయ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం సరైన పద్ధతి కాదని కాశి రామకృష్ణ విమర్శించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ నిర్వహించాలని ఆయన కోరారు.
నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్సిపల్ కమిషనర్ పి. రవివర్మపై విచారణ జరిపి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ అధికారులను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని ప్రభుత్వం అరికట్టాలని, ప్రభుత్వ ఉద్యోగుల నిష్పాక్షికతను కాపాడేందుకు ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని కాశి రామకృష్ణ కోరారు.


