అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి
వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు శాస్త్రీయ కారణాల పేరుతో మాట్లాడటం హాస్యాస్పదం: కాశి రామకృష్ణ
అమలాపురం( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి): అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కుక్కకాటుకు గురైన పసిపిల్లల గాయాలను దుస్తులు ఉతికేందుకు ఉపయోగించే రిన్ డిటర్జెంట్ సబ్బుతో శుభ్రం చేశారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్సీపీ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ శాస్త్రీయ కారణాల పేరుతో వివరణ ఇవ్వడం ద్వారా అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలపై, ముఖ్యంగా పసిపిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అంశంపై వైఎస్సార్సీపీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ స్పందిస్తే, దానికి శాస్త్రీయ రంగు పులిమి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకోవడం సరికాదన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కుక్కకాటు గాయాలను నీరు, సబ్బుతో శుభ్రం చేయాలని సూచిస్తుందనే విషయం వాస్తవమేనని, అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పసిపిల్లల గాయాలను ప్రత్యేకంగా రిన్ డిటర్జెంట్ సబ్బుతోనే శుభ్రం చేయాలని ఏ వైద్య మార్గదర్శకాల్లో ఉందో సూపరింటెండెంట్ స్పష్టం చేయాలని కాశి రామకృష్ణ ప్రశ్నించారు.
డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆసుపత్రిని సందర్శించిన రెండో రోజున కూడా పిల్లల గాయాలను రిన్ సబ్బుతో శుభ్రం చేస్తున్నట్లు కనిపించిందని ఆయన పేర్కొన్నారు. పిల్లల గాయాలను దేనితో శుభ్రం చేస్తున్నారని తల్లిదండ్రులను అడిగినప్పుడు ఆసుపత్రి సిబ్బంది రిన్ సబ్బులు ఇచ్చారని వారు తెలిపారని, ఆ సమయంలో తాను కూడా అక్కడే ఉన్నానని కాశి రామకృష్ణ అన్నారు.
ఆసుపత్రిలో వైద్యపరంగా ఉపయోగించే యాంటీసెప్టిక్ సోప్ లేదా గాయాల శుభ్రపరిచేందుకు అవసరమైన ప్రాథమిక వైద్య సామగ్రి అందుబాటులో లేకపోవడం వల్లే సిబ్బంది డిటర్జెంట్ సబ్బును ఉపయోగించాల్సి వచ్చిందా? అనే అంశాన్ని కూడా అధికారులు విచారణలో తేల్చాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, వైద్య సామగ్రి సరఫరాపై వస్తున్న ఆరోపణలు నిజమా కాదా అన్నది కూడా ఉన్నతాధికారులు పరిశీలించాలని కోరారు. పసిపిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోలేదని అధికారులు స్పష్టమైన ఆధారాలతో ప్రజలకు వివరించాలని అన్నారు.
పసిపిల్లల ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారం కావడంతో ఆరోపణలపై స్వతంత్రంగా, పారదర్శకంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కాశి రామకృష్ణ కోరారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు, అత్యవసర మందులు, గాయాల శుభ్రపరిచేందుకు అవసరమైన ప్రాథమిక వైద్య సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
– కాశి రామకృష్ణ
జిల్లా అధికార ప్రతినిధి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా

