Saturday, October 24, 2026
More
    HomeUncategorizedతాళ్లరేవులో అభివృద్ధి ధమాకా.. రూ.11.75 కోట్ల పనులకు శ్రీకారం! ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు...

    తాళ్లరేవులో అభివృద్ధి ధమాకా.. రూ.11.75 కోట్ల పనులకు శ్రీకారం! ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దూకుడు.. పల్లెల అభివృద్ధికి భారీ ముందడుగు! సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పుష్కర ఘాట్లు, తాగునీటి పథకాలకు పెద్దపీట

    📰 Generate e-Paper Clip

    తాళ్లరేవు, అక్టోబర్ 10 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

    తాళ్లరేవు మండలంలో అభివృద్ధి పనులకు వేగం పెరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్లరేవు మండలంలో రూ.11.75 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) శనివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

    రూ.8.18 కోట్లతో సీసీ రోడ్లు

    పిల్లంక, ఇంజరం, పోలేకుర్రు, తాళ్లరేవు, కోరంగి, పటవల, చొల్లంగి గ్రామాల్లో రూ.8.18 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గ్రామాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజల రాకపోకలను సులభతరం చేయడంతో పాటు రవాణా ఇబ్బందులను తగ్గించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

    పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.3.03 కోట్లు

    పిల్లంక, తాళ్లరేవు, గోపులంక, గోవులంక గ్రామాల్లో రూ.3.03 కోట్లతో చేపట్టనున్న పుష్కర రోడ్లు, ఘాట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. భక్తులకు, స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

    తాగునీటి సదుపాయాలకు ప్రత్యేక ప్రాధాన్యం

    నీలపల్లి గ్రామంలో రూ.39.78 లక్షలతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. నీలపల్లి పంచాయతీ పరిధిలోని రేవువారిపేటలో మంచినీటి చెరువు ఆధునికీకరణ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు.

    గ్రామగ్రామాన అభివృద్ధి పనులు

    ఇంజరంలో బీసీ కమ్యూనిటీ హాల్‌ను, అరటికాయలంకలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. తాళ్లరేవులో మాధవరాయుడుపేట, పరదేశమ్మపేట ప్రాంతాల్లో రోడ్డు కం డ్రైనేజీలను ప్రారంభించి, విష్ణాలయం వద్ద పుష్కర ఘాట్ అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. గొల్లల వీధిలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, గుత్తులవారిపాలెంలో సీసీ రోడ్డును ప్రారంభించారు.

    కోరంగిలో ప్రతాప్ నగర్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద సీసీ రోడ్డును, గుడ్డువాణి తూము ప్రాంతంలో డ్రైనేజీ పనులను ప్రారంభించారు. కొత్త కోరంగి, పాత కోరంగి గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. చిన్న బొడ్డు వెంకటాయపాలెంలో హైస్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    పటవలలో శాంతిమూల ప్రాంతంలో సీసీ రోడ్డును, బీసీ కాలనీలో సీసీ రోడ్డు కం డ్రైనేజీని ప్రారంభించారు. చొల్లంగిలో డాక్టర్ శ్రీమన్నారాయణ ఇంటి వద్ద, శ్రీపాదవారిపేటలో సీసీ రోడ్లను ప్రారంభించారు. ఇంజరం నుంచి ఉప్పంగల వెళ్లే రహదారిలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

    గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

    ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

    పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

    చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

    ఈ కార్యక్రమాల్లో తాళ్లరేవు మండల పార్టీ అధ్యక్షుడు దూళిపూడి బాబి, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

    జీఎస్‌బీ వార్త | రిపోర్టర్ వేణు కాశి

    నిజాన్ని నిర్భయంగా.. ప్రజల పక్షాన!

     

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!