కాకినాడ సిటీ అక్టోబర్ 12 జి ఎస్ బి వార్త
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతానికి పైగా సీట్లు కేటాయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కాకినాడలోని జీఆర్టీ హోటల్ వేదికగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ నాయకత్వం ఉమ్మడిగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీలకు అత్యున్నత రాజకీయ ప్రాధాన్యత లభించిందని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై తీవ్ర కక్ష సాధింపు చర్యలు జరిగాయని ఆరోపించారు.రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ, ఇచ్చిన మాట ప్రకారం ‘సూపర్ సిక్స్’ హామీల్లో దాదాపు 80 శాతం పథకాలను ప్రభుత్వం ఇప్పటికే విజయవంతంగా అమలు చేసిందని పేర్కొన్నారు. పింఛన్ల పెంపు, స్త్రీ శక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేశామని వివరించారు.డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షణలో ‘పల్లె పండుగ’ ద్వారా వేల కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, ఆధునిక మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేస్తూ, జలజీవన్ మిషన్ కింద దాదాపు రూ. 30,000 కోట్ల టెండర్లతో ఇంటింటికీ కొళాయిల పనులను వేగవంతం చేశామన్నారు.ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మతులు, రూ. లక్ష కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. పోలవరం పనులను వేగవంతం చేయడంతో పాటు రాజధాని అమరావతిని 2028 నాటికి జాతికి అంకితం చేసే లక్ష్యంతో సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని తెలిపారు.
గత పాలకుల అవినీతి కారణంగానే నాటి మంత్రులు, అధికారులు జైళ్లకు వెళ్లాల్సి వచ్చిందని, వివేకానందరెడ్డి హత్య కేసులోని వాస్తవాలు సైతం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సంక్షేమం నిరంతరాయంగా కొనసాగేందుకు రాబోయే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఎమ్మెల్సీ పేరా బత్తుల రాజశేఖర్, టిడిపి నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు.

