మెగా డీఎస్సీపై దుష్ప్రచారం రుజువు చేస్తే రాజీనామా చేస్తా: ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ సవాల్
కాకినాడ, (జిఎస్ బి వార్త ప్రతినిధి )
కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ రూరల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.డీఎస్సీ నియామకాల వ్యవహారంలో ఎలాంటి తప్పు జరగలేదని, ఒకవేళ లొసుగులు గానీ, అక్రమాలు గానీ జరిగినట్లు వైసీపీ నాయకులు నిరూపిస్తే తాను తక్షణమే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నాయని మండిపడ్డారు.హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందిప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, ఇచ్చిన హామీల అమలుకు పూర్తిగా కట్టుబడి ఉందని ప్రభుత్వ ప్రతినిధి స్పష్టం చేశారు. ఒకవేళ పొరపాట్లు జరిగితే నైతిక బాధ్యత వహించడానికి ప్రభుత్వం ఎప్పుడూ వెనుకాడదని పేర్కొన్నారు.నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రభుత్వం మర్చిపోలేదని, అయితే కేవలం భృతి ఇవ్వడం కంటే యువతకు విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించి, పరిశ్రమల స్థాపన ద్వారా యువత భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిరుద్యోగ భృతితో పాటు వివిధ హామీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే స్పష్టత ఇస్తారని వెల్లడించారు. సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తున్నామని, కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారులకు వచ్చే నెల నుండి గృహ సంబంధిత ప్రయోజనాలను అందించేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేరుస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
