16,347 పోస్టుల మెగా డీఎస్సీ పై బహిరంగ చర్చకు సిద్ధం: వైయస్ కి టిడిపి నాయకురాలు సుంకర పావని సవాల్
కాకినాడ సిటీ (ఆగస్టు 13):
16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణ మరియు ఉపాధ్యాయ నియామకాలపై వైఎస్సార్సీపీని ఏ వేదికపైనైనా ఎండగట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ అన్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని, వారే సమయం మరియు వేదిక ఖరారు చేయాలని ఆమె సవాల్ విసిరారు.గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో నిరుద్యోగులు, టీచర్ అభ్యర్థులు ఘోరంగా దగా పడ్డారని పావని విమర్శించారు. ప్రతి ఏటా మెగా డీఎస్సీ ఇస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక ‘జాబ్ క్యాలెండర్’ పేరుతో అబద్ధాలు చెబుతూ యువత జీవితాలతో ఆడుకున్నారని దుయ్యబట్టారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో “పోస్టులు లేవు”, “సర్దుబాటు చేస్తున్నాం” అంటూ సాకులు చెప్పిన బొత్స సత్యనారాయణకు ఇప్పుడు డీఎస్సీపై మాట్లాడే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు.అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేసి కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని ఆమె తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిరుద్యోగ ద్రోహం, ప్రస్తుత ప్రభుత్వ పారదర్శక నియామకాలపై టీవీ కెమెరాల ముందే ప్రత్యక్ష చర్చకు సంపూర్ణ ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ సవాల్ నుంచి పారిపోకుండా సమాధానం చెప్పాలని సుంకర పావని డిమాండ్ చేశారు
.
