అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ, శరవణ ఆధ్వర్యంలో చిత్రలేఖన న్యాయనిర్ణేత తులసిరావుకు ఘన సన్మానం
కాకినాడ, జూలై 20:(జిఎస్ బి వార్త)
అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శరవణ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చిత్రలేఖన ఉపాధ్యాయులు టి. తులసిరావు గారిని శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఇటీవల డి.కె.వి.ఎస్. జూనియర్ కళాశాలలో నిర్వహించిన “ప్రకృతి స్ఫూర్తితో – మన భవిష్యత్తు వాతావరణం కోసం” అనే అంశంపై జరిగిన గ్రీన్ పోస్టర్ చిత్రలేఖన పోటీకి ఆయన న్యాయనిర్ణేతగా వ్యవహరించి అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేసిన సందర్భంగా ఈ సన్మానం నిర్వహించారు.
క్లబ్ అధ్యక్షులు యాళ్ళ రత్నారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రెండు వయో విభాగాల్లోని విద్యార్థుల చిత్రాలను పరిశీలించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు నాలుగు కన్సోలేషన్ బహుమతులను శ్రీ తులసిరావు గారు ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు యాళ్ళ రత్నారావు మాట్లాడుతూ, “పిల్లలలో సృజనాత్మకతను వెలికితీయడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైనది. తులసిరావు గారు నిష్పాక్షికంగా చిత్రాలను ఎంపిక చేసి ఈ పోటీకి మరింత గౌరవాన్ని తీసుకొచ్చారు. వారికి క్లబ్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము” అన్నారు.
క్లబ్ వ్యవస్థాపకులు దిలీప్ కుమార్ సధనాని మాట్లాడుతూ, “పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీకి 20 పాఠశాలల నుండి 120 మంది విద్యార్థులు పాల్గొనడం ఆనందదాయకం. విద్యార్థుల ప్రతిభను గుర్తించి నిష్పాక్షికంగా విజేతలను ఎంపిక చేసిన తులసిరావు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు” తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జె. సుబ్బలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థుల్లో కళా నైపుణ్యాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని, అలయన్స్ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని కొనియాడారు.
సన్మానానికి స్పందించిన శ్రీ టి. తులసిరావు మాట్లాడుతూ, “పర్యావరణ పరిరక్షణ అనే గొప్ప సందేశాన్ని చిన్నారుల్లో నాటేందుకు అలయన్స్ క్లబ్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రశంసనీయం. పాల్గొన్న ప్రతి విద్యార్థి విజేతే. కళ ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చు” అని అన్నారు.
పోటీలో ఎంపికైన విజేతల పేర్లను ఆయా పాఠశాలలకు తెలియజేసి, బహుమతులను సంబంధిత పాఠశాలల్లోనే అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతి విజేతలు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయబడతారు. జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి రూ.5,000/-, ద్వితీయ బహుమతి రూ.3,000/-, తృతీయ బహుమతి రూ.2,000/- నగదు బహుమతులు అందజేయబడతాయి. జిల్లా స్థాయి విజేతలు అంతర్జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి రూ.50,000/-తో పాటు షీల్డ్, ద్వితీయ బహుమతి రూ.25,000/-తో పాటు షీల్డ్, తృతీయ బహుమతి రూ.15,000/-తో పాటు షీల్డ్, అదనంగా నలుగురు కన్సోలేషన్ విజేతలకు ఒక్కొక్కరికి రూ.5,000/- మరియు ప్రశంసాపత్రం అందజేయబడుతుంది అని దిలీప్ కుమార్ సధనాని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో అంకిత్ కుమార్ జైన్, దిలీప్ జైన్, క్లబ్ కార్యదర్శి దామిశెట్టి శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయులు ఎ. శివరామ్, కె. మాధురి, వై. రమ, బి. వెంకట పద్మ తదితరులు పాల్గొన్నారు.
