ఐ.పోలవరం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐ.పోలవరం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న బీర సత్యకుమారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామగ్రామాన అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఐ.పోలవరం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బీర సత్యకుమారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
ఈ సమావేశంలో డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయి, చెల్లి అశోక్, దాట్ల పృథ్వీరాజ్‌తో పాటు పలువురు కూటమి సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.


