కాకినాడ సిటీ అక్టోబర్ 19 జి ఎస్ బి వార్త
కళలు, సంస్కృతికి నిలయమైన కాకినాడ నగరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల వేళ సరికొత్త సాంస్కృతిక శోభ వెల్లివిరిసింది. ప్రముఖ లగ్జరీ ఆభరణాల బ్రాండ్ ‘వేగా జ్యువెలర్స్’ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నాగమల్లితోట జంక్షన్ సమీపంలోని ద్వారంపూడి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘రాగ దండియా ఉత్సవ్ 2.0’ అత్యంత వైభవంగా జరిగింది. సంప్రదాయ కళారూపాలతో పాటు ఆధునిక వినోదాన్ని మేళవించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర ప్రజలు, మహిళలు, యువతీ యువకులు భారీ సంఖ్యలో పాల్గొని దండియా, గర్బా నృత్యాలతో సందడి చేశారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు పూర్ణకుంభం, సంప్రదాయ హారతి, తిలకంతో నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బిగ్ బాస్ ఫేమ్ ఉదయ్ మాస్టర్ బృందం ప్రదర్శించిన ప్రత్యేక సాంస్కృతిక నృత్య రూపకాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒకవైపు డీజేల ఆధునిక బీట్లు, మరోవైపు పంజాబీ ధోల్ వాయిద్యాల హోరుతో వేదిక మార్మోగింది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంప్రదాయ పోటీలు, గాజుల దుకాణాలు, ఫేస్ పెయింటింగ్, సెల్ఫీ పాయింట్లతో పాటు కాకినాడ ప్రత్యేక రుచులతో కూడిన ఆహార స్టాళ్లు సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచాయి.ఈ సందర్భంగా వేగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా మాట్లాడుతూ.. కాకినాడలో ఇంతటి భారీ స్థాయిలో ఉత్సవాన్ని నిర్వహించడం తమకు ఇదే మొదటిసారని, స్థానిక సంప్రదాయాల కలయికతో శరన్నవరాత్రులను జరపడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. భక్తి, సంస్కృతి, ఐక్యతను పెంపొందించేందుకు ఈ వేడుక వేదికగా నిలిచిందన్నారు.సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమా మాట్లాడుతూ.. పండుగలు సమాజంలో అనుబంధాలను బలోపేతం చేస్తాయని, నగర మహిళలు, యువత చూపిన ఉత్సాహం కాకినాడ కళాభిమానానికి నిదర్శనమని కొనియాడారు. 1989 నుంచి భారతీయ హస్తకళల వారసత్వాన్ని, స్వచ్ఛతను కాపాడుతూ వస్తున్న వేగా జ్యువెలర్స్, నగర ప్రజలకు ఒక మరపురాని పండుగ అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు తెలిపారు.
