కాకినాడ సిటీ ఆగస్టు 10 జి ఎస్ బి వార్త
కాకినాడ నగరంలో ‘మిత్ర బృందం’ మూడవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. గడిచిన మూడేళ్లుగా పేదలు, విద్యార్థులకు అండగా నిలుస్తూ సంస్థ అందిస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీసీ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మానవ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా అత్యవసర సమయాల్లో రోగులను ఆదుకునేందుకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. బృంద సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అంతే కాక కొన్ని ప్రాంతాల నుండి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం వారికి ఉచితంగా సైకిళ్లను బహుకరించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవాలని అతిథులు ఆకాంక్షించారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పలు పేద కుటుంబాలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులను అందజేశారు.భవిష్యత్తులో విద్య, వైద్యం, రక్తదానం వంటి మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్న మిత్ర బృందం సేవలు అభినందనీయమని, ఇతరులకు ఇవి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను, సేవాభావంతో ముందడుగు వేసిన వారిని బృంద సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో మిత్ర బృందం ప్రతినిధులు, విద్యార్థులు, రక్తదాతలు మరియు స్థానికులు పాల్గొన్నారు.
మిత్ర బృందం మూడవ వార్షికోత్సవం: ఘనంగా సేవా కార్యక్రమాలు
Date:
