మిడ్ డే న్యూస్ (ఇప్పటి వరకు ఉన్న వార్తలు)

    Date:

    📰 Generate e-Paper Clip

    మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు

    ఎంపీ సాన సతీష్

    న్యూఢిల్లీ, జూలై 29:(జిఎస్ బి వార్త)

    ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువతను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు విమర్శించారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన *గ్రూప్-1 నియామకాల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, జగన్ అరెస్ట్ చేయాలని * ఆయన డిమాండ్ చేశారు.ఐదేళ్ల పాటు బీఈడ్, డీఈడ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతను ఎదురుచూపుల్లో ఉంచి, ఎన్నికల ముందు ఉద్యోగాలు, డీఎస్సీ పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం వైసీపీదేనని ఆయన అన్నారు. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు మెగా డీఎస్సీపై విమర్శలు చేయడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మండిపడ్డారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి *శ్రీ నారా చంద్రబాబు నాయుడు* తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైల్‌పైనే చేశారని, ఇచ్చిన హామీ మేరకు కేవలం *100 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేసినట్లు* తెలిపారు.మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు *150కి పైగా కోర్టు కేసులు* వేసిన వారే ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నట్లు నటించడం రాజకీయ కపటత్వానికి నిదర్శనమని అన్నారు. అన్ని న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి చట్టబద్ధంగా నియామకాలు పూర్తి చేసిన కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ఉద్యోగాలు సాధించిన *16 వేలకుపైగా అభ్యర్థులను, వారి కుటుంబాలను అవమానిస్తున్నారని* విమర్శించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన *గ్రూప్-1 నియామకాలలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకుని అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని*, ఆ వ్యవహారంపై సమగ్ర *సీబీఐ విచారణ జరిపించాలని* డిమాండ్ చేశారు.విద్యాశాఖ మంత్రి *నారా లోకేశ్* బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యారంగంలో వేగంగా సంస్కరణలు అమలవుతున్నాయని, ఉపాధ్యాయ నియామకాలు, విద్యార్థుల సంక్షేమం, విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని జీర్ణించుకోలేక వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని అన్నారు. మెగా డీఎస్సీపై ఆరోపణలు నిరూపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరినా వైసీపీ నాయకులు వెనక్కి తగ్గారని గుర్తుచేశారు.తప్పుడు ప్రచారాలు మానేసి, మెగా డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీకి సానా సతీష్ బాబు సవాల్ విసిరారు.* ఉద్యోగాల విషయంలో కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోగా, వైసీపీ మాత్రం నిరుద్యోగ యువతను మోసం చేసిందనే విషయాన్ని ప్రజలు బాగా గుర్తుంచుకున్నారని ఆయన పేర్కొన్నారు.

     

    ———————

    అక్షరజ్ఞానం అందించే అక్షయపాత్ర,అజ్ఞానాన్ని పోగొట్టే ప్రత్యక్ష దైవం, గురువు..డా అడ్డాల

    కాకినాడ, (జిఎస్ బి వార్త )

    స్థానిక ఈశ్వర్ నగర్ లో ఉన్న మోహన్ కాన్వెంట్ వ్యవస్థాపకులు మోహన్ గారినిగురుపూర్ణిమ సందర్భంగా, డా అడ్డాల సత్యనారాయణ ఆధ్వర్యాన మోహన్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపకులు మోహన్ మాట్లాడుతూ ” గురువులు కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే శిల్పులు అని, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, నాయకులు.. ఇలా ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక గురువు కృషి ఉంటుందని, విద్యార్థులలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, జ్ఞానమనే వెలుగును నింపేవారే గురువులని, పుస్తకాలలోని చదువుతో పాటు సమాజంలో ఎలా జీవించాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనే నైతిక విలువలను, క్రమశిక్షణను గురువులు నేర్పిస్తారని,తల్లిదండ్రుల లాగే విద్యార్థి తనకంటే ఉన్నత స్థాయికి ఎదిగితే మనస్ఫూర్తిగా ఆనందించేది ఒక్క గురువు మాత్రమేనని అన్నారు.ప్రముఖ దంత వైద్య నిపుణులు డా అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ “మోహన్ విద్యా రంగంలో ఎన్నో ఏళ్లుగా  ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దిన ఉత్తమ గురువు అని అన్నారు, అన్ని వృత్తులలోకల్లా అత్యుత్తమమైనది మరియు పవిత్రమైనది” గా గురు వృత్తి ని పరిగణిస్తారని, “మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ” అని మన సంస్కృతి గురువుకు తల్లిదండ్రుల తర్వాత దేవుడి స్థానాన్ని ఇచ్చిందని,గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని, ఆషాఢ మాస పౌర్ణమి రోజున శ్రీ వేద వ్యాస మహర్షి జన్మించినందున ఈ రోజును ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పౌర్ణమి’ గా జరుపుకుంటామని ,​అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహనీయుడే “గురువు” అని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ స్నేహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

    ——-/———————–

    తిరుమల విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సురేష్ మృతి పట్ల సీపీఐ నేత తాటిపాక మధు తీవ్ర దిగ్బ్రాంతి

    రాజమహేంద్రవరం, జులై 29 జి ఎస్ బి వార్త)

    తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు సోదరులు నున్న సురేష్ ఈరోజు తెల్లవారు జామున రోడ్ ప్రమాదంలో మరణించడం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఉదయమే ఆయన మరణ వార్త తన హృదయాన్ని కలచి వేసిందన్నారు ఆయన లేని లోటు తిరుమల విద్యాసంస్థలకు, ఆయన కుటుంబానికి మాత్రమే కాకుండా తన వంటి సన్నిహితులకు కూడా తీరనిదని మధు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నున్న సురేష్ భౌతికయానికి నివాళులర్పించారు అనంతరం నున్న తిరుమలరావు ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


     

    బాల రాజేశ్వరి పీఠంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

     

    అనపర్తి, జూలై 29 (జి ఎస్ బి వార్త )

    అనపర్తి పాత ఊరులోని శ్రీ బాల రాజేశ్వరి పీఠంలో కొలువుదీరిన శ్రీ షిరిడి సాయినాధునికి గురు పౌర్ణమి వేడుకలను బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.వేద పండితులు రెడ్డి సురేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయిబాబా విగ్రహాన్ని ఏనుగుల ఆకృతులతో విశేషంగా అలంకరించారు. అనంతరం “ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి” నామజపం, సాయి చాలీసా పారాయణం నిర్వహించారు. వ్యాసపీఠం, మహాభారత గ్రంథాలతో అలంకరించిన సాయినాధుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ సందర్భంగా రెడ్డి సురేష్ శర్మ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో గురు పౌర్ణమికి విశిష్ట స్థానం ఉందన్నారు. వ్యాస పౌర్ణమిగా పిలువబడే ఈ పవిత్ర దినాన తల్లిదండ్రులు, గురువుల ఆశీస్సులు పొందడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు సిద్ధిస్తుందని పేర్కొన్నారు.పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రామమోహనరావు దంపతులు, కర్రి పాండురంగారెడ్డి దంపతులు, కొవ్వూరి భీమేష్ రెడ్డి దంపతులు, కర్రి సుధాకర్ రెడ్డి–అలివేలు దంపతులు, రెడ్డి సతీష్, నల్లమిల్లి వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


    *ఇథనాల్ ఫ్యాక్టరీ విస్తరణ ఉత్పత్తి పెంపుదలకు తగదు.. భారత కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకత*

    గోకవరం జులై 29( జి ఎస్ బి వార్త)

    తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ల దొడ్డి గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ విస్తరణ తగదని తూర్పుగోదావరి జిల్లా సిపిఐ జిల్లా ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి కొండేపూడి జ్యోతిరాజు విమర్శించారు. గోకవరంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఉత్పత్తి కేడిపిఎల్ 2 లక్షల లీటర్ల సామర్థ్యం ఉండగా దానిని రాబోయే కాలానికి మూడు లక్షల కేడిపిఎల్ వరకు పెంచడానికి ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టిందన్నారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో చేపట్టగా దానిని సిపిఐ జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా గతంలో వ్యతిరేకించిందని ఆయన అన్నారు. గతంలో ఫ్యాక్టరీ ఇథనాల్ సామర్థ్యాన్ని పెంచడాన్ని నిరసిస్తూ సిపిఐ జిల్లా నాయకులు తాటిపాక మధు, కొండేపూడి జ్యోతి రాజు, కాండ్రపు రాంబాబు, కొండలరావు తదితరులు ఫ్యాక్టరీ యాజమాన్యానికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంత ప్రజలందరూ ఫ్యాక్టరీ విస్తరణని వ్యతిరేకిస్తుండగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఫ్యాక్టరీ సామర్ధ్యాన్ని పెంచడానికి ప్రయత్నాలు చేయడం తగదని కమ్యూనిస్టు నాయకులు అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు జూలై 14న జరిగినప్పుడు కార్యక్రమానికి వచ్చిన పలువురు మేధావులు పర్యావరణ వేత్తలు ఫ్యాక్టరీ విస్తరణ తగదని తీవ్రంగా హెచ్చరించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇదే విధానం అవలంబిస్తే ఫ్యాక్టరీ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు జల వాయు శబ్ద కాలుష్యాన్ని ఎదుర్కొంటారని దానివల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలు అవుతారని వారు అన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇదేవిధంగా నిరంకుశంగా వ్యవహరిస్తే భారత కమ్యూనిస్టు పార్టీ దశలవారీగా ఉద్యమిస్తామని సిపిఐ మండల కార్యదర్శి మరియు ఏఐ కే ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండేపూడి జ్యోతిరాజ్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని హెచ్చరించారు.


    స్థానిక సమరానికి కమలం సన్నద్ధం

    స్థానిక ఎన్నికలే లక్ష్యం.. బీజేపీ ప్రత్యేక కమిటీ ఏర్పాటు

    నాలుగు జోన్లు.. ఒకే వ్యూహం.. స్థానిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్

    స్తానిక పోరుకు కమలం సమాయత్తం

    ఎన్నికల వ్యూహానికి నాలుగు జోన్ల ప్రత్యేక కమిటీ.. సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్*

    అమరావతి, జూలై 29: రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ ఎన్నికల సన్నాహాలను ముమ్మరం చేసింది. పార్టీని గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణ, సమన్వయం, వ్యూహరచన కోసం రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.రాష్ట్రాన్ని ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా ఆంధ్ర, రాయలసీమ అనే నాలుగు జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు అనుభవజ్ఞులైన సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల నిర్వహణ, సంస్థాగత సమన్వయం, క్షేత్రస్థాయి కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణులతో నిరంతర సమన్వయం వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.ప్రత్యేక కమిటీలో సభ్యులు

    రాష్ట్ర ఆరోగ్య మంత్రి వై. సత్యకుమార్

    – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు

    – ఎమ్మెల్యే ఈశ్వర్‌రావు నడుకుడితి

    – రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడారి ఆనంద్ కుమార్

    – ఎమ్మెల్సీ, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

    – రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి

    – ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి

    – రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ

    – ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి

    – ఎమ్మెల్యే డా. పొదల వెంకట పార్థసారథి

    స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చే లక్ష్యంతో ఈ కమిటీ జిల్లా, మండల, శక్తికేంద్ర స్థాయిల్లో పార్టీ శ్రేణులతో సమన్వయం చేస్తూ సమగ్ర కార్యాచరణను అమలు చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. బూత్ స్థాయి బలోపేతం, కార్యకర్తల సమీకరణ, ఎన్నికల నిర్వహణలో సమర్థమైన వ్యూహంతో ముందుకు సాగాలని కమిటీ సభ్యులకు ఆయన సూచించారు.


    గాంధీ పార్క్‌కు పూర్వ వైభవం… కర్రి సూరారెడ్డి సేవకు ప్రజల ప్రశంసల వెల్లువ

    గోకవరం, జూలై 29: జి ఎస్ బి వార్త

    గోకవరం ప్రధాన రహదారిలో ఉన్న గాంధీ పార్క్‌ను స్వచ్ఛందంగా శుభ్రపరచించిన ఏ వన్ చికెన్ సెంటర్ అధినేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కర్రి సూరారెడ్డి మాట్లాడుతూ, “మహాత్మా గాంధీ దేశానికి చూపిన మార్గం స్వచ్ఛత, సేవ, క్రమశిక్షణ. అలాంటి మహనీయుడి విగ్రహం ఉన్న ప్రదేశం అపరిశుభ్రంగా ఉండడం బాధ కలిగించింది. అందుకే ఎవరైనా చేస్తారనే ఎదురుచూడకుండా, మన బాధ్యతగా భావించి మా సిబ్బందితో కలిసి పార్కును పూర్తిగా శుభ్రం చేయించాం” అని అన్నారు.”ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులు చేయాలనే భావన కాకుండా, ప్రతి పౌరుడు తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బాధ్యత తీసుకోవాలి. సమాజం కోసం మన వంతు సేవ చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. గోకవరం అందంగా, పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలందరూ కలిసి ముందుకు రావాలి” అని ఆయన పిలుపునిచ్చారు.అలాగే, “గాంధీ పార్క్‌ను పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత. మళ్లీ చెత్తాచెదారం వేయకుండా ప్రజలు సహకరించాలని, ఈ పార్కును ప్రతి ఒక్కరూ తమ సొంత ఆస్తిలా భావించి కాపాడాలని” సూరారెడ్డి విజ్ఞప్తి చేశారు.గత కొన్ని నెలలుగా పొదలు, చెత్తాచెదారం, వ్యర్థాలతో నిండిపోయిన పార్కును పూర్తిస్థాయిలో శుభ్రం చేయడంతో పాటు గాంధీ విగ్రహ పరిసరాలను కూడా అందంగా తీర్చిదిద్దారు. శుభ్రపరిచే ముందు, తర్వాత తీసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మండల ప్రజలు కర్రి సూరారెడ్డి సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.పొదలతో నిండిపోయిన గాంధీ పార్క్‌కు తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం **”నాడు–నేడు”**ను గుర్తు చేసేలా ఉందని స్థానికులు పేర్కొంటూ, సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని కొనియాడారు.


    కారం రామన్న దొర ను పరామర్శించిన ఏపీ ఆదివాసీ జేఏసీ నాయకులు.

    ఆశ్రమ పాఠశాలలో ఇద్దరేసి ఏఎన్ఎం పోస్ట్లు భర్తీ చేయాలి. ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి.

    దేవీపట్నం,జూలై 29.( జి ఎస్ బి వార్త )

    వెన్నుపూస నొప్పితో మరియు జ్వరంతో బాధపడుతున్న ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర ను ఆర్ అండ్ ఆర్ కాలనీ పెద్ద భీం పల్లి – 2 పెనికిల పాడు గ్రామంలో ఉన్న ఇంటికి వెళ్లి పరామర్శించామని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ…వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఏజెన్సీ మన్యం ప్రాంతంలో ప్రజలు అనారోగ్యానికి గురై మంచం పడుతున్నారన్నారు. మరోవైపు హాస్టల్స్ లో ఉన్న ఆదివాసీ విద్యార్థులు అనారోగ్యానికి గురై హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు.ఈ మధ్యకాలంలో సరైన వైద్య అందక కొన్ని చోట్ల చనిపోతున్న సంఘటనలు ఉన్నాయన్నారు.కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆశ్రమ పాఠశాలలో ఇద్దరేసి ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని అలాగే మన్యం ప్రాంతంలోని ఏజెన్సీ అన్ని గ్రామాలలో యుద్ధ ప్రాతిపదికన మెడికల్ క్యాంపులు నిర్వహించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరరావు,కంగల గిరి,ఎ.శ్రీనివాసు,కె.రఘుపతి మొదలైన వారు పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...

    రూ.1,700 కోట్ల అభివృద్ధి పరుగులు.. ముమ్మిడివరంలో దాట్ల మార్క్‌!

    నాలుగు మండలాలు.. ఒకే విజన్‌.. అభివృద్ధి బాటలో...

    రూ.1,700 కోట్ల అభివృద్ధి జోరు.. ముమ్మిడివరంపై దాట్ల మార్క్‌!

    నాలుగు మండలాలు.. అభివృద్ధి, సంక్షేమానికి...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!