అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీల్లో ఆదిత్యకు ప్రథమ బహుమతి –
ఇండోనేషియాలో జరిగిన ‘రోబోరోర్జ్–2026’లో ప్రతిభ చాటిన విద్యార్థులు
కాకినాడ, నవంబరు 7:(జిఎస్ బి వార్త)
అంతర్జాతీయ స్థాయి రోబోటిక్స్ పోటీల్లో కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఇండోనేషియాలోని తాంగెరాంగ్ నగరంలో ఉన్న యూపీహెచ్ విశ్వవిద్యాలయంలో అక్టోబరు 29 నుంచి 31 వరకు నిర్వహించిన ‘రోబోరోర్జ్–2026’ అంతర్జాతీయ రోబోటిక్స్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించి దేశానికి, కళాశాలకు కీర్తి తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 100కు పైగా జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ తరఫున కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలకు చెందిన ‘ఆదిత్య సైబర్ ఇన్నోవేటర్స్’ బృందం ప్రాతినిధ్యం వహించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం తృతీయ సంవత్సరం విద్యార్థి ముత్యాల రవి దొడ్డి దత్త శ్రీకరి నేతృత్వంలోని బృందం వినూత్న ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యంతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేతలకు మెరిట్ సర్టిఫికెట్ అందజేశారు. ఇమాజినరీ, పైలట్, అటానమస్ అనే మూడు ప్రధాన విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ విజయంపై ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై విద్యార్థులు రాణించేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక వనరులు, నిపుణుల మార్గదర్శకత్వం అందించడంలో సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రోత్సహించి ఈ విజయానికి దోహదపడిన అధ్యాపక బృందాన్ని కళాశాల కార్యదర్శి డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి అభినందించారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన అభినందన సభలో అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఇవిఎల్. నాయుడు, డీన్ సిద్ధార్థరెడ్డి, ఏఎస్సీఎస్ ప్రిన్సిపాల్ డి బ్యూలా, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కరుణ, ఏఎస్ఎంఎస్ ప్రిన్సిపాల్ ఎండి షైద్దీన్ తదితరులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
