కాకినాడ సిటీ అక్టోబర్ 25 జి ఎస్ బి వార్త
గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ‘అస్మిత’ ఖేలో ఇండియా సౌత్ జోన్ జూనియర్, సబ్-జూనియర్ మహిళల లీగ్ హాకీ టోర్నమెంట్‌ను కాకినాడలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక డీఎస్ఏ (DSA) గ్రౌండ్‌లో అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఈ ప్రతిష్టాత్మక పోటీలు జరగనున్నాయి.
హాకీ ఇండియా గుర్తింపు పొందిన తర్వాత మొదటిసారిగా కాకినాడ ఈ స్థాయి పోటీలకు వేదిక కావడం విశేషం. ఈ లీగ్‌లో సౌత్ జోన్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు పలు గుర్తింపు పొందిన క్లబ్ జట్లు పాల్గొంటున్నాయి. టోర్నీలో మొత్తం 6 సబ్-జూనియర్, 6 జూనియర్ జట్లు తలపడనున్నాయి.
ఈ జోనల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులను ఆల్-ఇండియా టోర్నమెంట్‌తో పాటు నేషనల్ క్యాంపులకు ఎంపిక చేయనున్నట్లు ప్రతినిధులు వివరించారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యం వహించేలా వారిని తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రోత్సహించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా స్థానిక బాలికలకు చక్కటి క్రీడా వేదిక లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు కడియాల రవిచంద్ర ప్రసాద్, అధ్యక్షుడు ఓక బాబ్జీ, ఉపాధ్యక్షురాలు పి. సుధారాణి, కార్యదర్శి అవినాష్, కోచ్ ప్రియాంక టోర్నమెంట్ జాయింట్ సెక్రటరీ ఎన్. దీప్తి ఎస్తేర్, కోశాధికారి (ట్రెజరర్) ఎన్. వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
