తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక, పునరుద్ధరణ చర్యలు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు 2 వేల మందికి పైగా సిబ్బంది రంగంలోకి
నేలకొరిగిన 8 వేలకుపైగా విద్యుత్ స్తంభాలు.. పునరుద్ధరణకు 10 వేల కొత్త స్తంభాలు సిద్ధం
రహదారులపై కూలిన చెట్ల తొలగింపు.. ఇప్పటికే 70 శాతానికి పైగా రాకపోకల పునరుద్ధరణ
13 వేల మందికి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం.. బాధితులకు అన్ని సౌకర్యాలు
సుమారు 5 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు
– జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్
,
అమలాపురం,
అక్టోబర్ 28,(జిఎస్ బి వార్త)
తీవ్ర తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు, పెనుగాలుల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో పాత్రికేయ మిత్రులతో ఆర్నాబ్ తుఫాన్ తీవ్రత ప్రభావం వలన జరిగిన నష్టం వంటి అంశాలు, ప్రజలకు సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం నిరంతరం పనిచేస్తోందన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.
గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు
తుఫాను ఓడలరేవు, రాజోలు పరిసర తీర ప్రాంతాల్లో తీరం దాటిందని, మంగళవారం రాత్రి 10.30 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయని కలెక్టర్ వివరించారు. పెనుగాలుల తీవ్రతకు జిల్లాలో పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో రవాణా, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు.
తుఫాను తీవ్రత కారణంగా ఫిలిప్పీన్స్‌కు చెందిన సుమారు 180 మీటర్ల పొడవైన సరుకు రవాణా నౌక ఓడలరేవు తీరానికి కొట్టుకువచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులను అప్రమత్తం చేసి, నౌక భద్రతతో పాటు తీర ప్రాంతంలో పటిష్ట పర్యవేక్షణ చర్యలు చేపట్టినట్లు వివరించారు.
విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక కార్యాచరణ
తుఫాను ప్రభావంతో జిల్లాలో సుమారు 8 వేలకుపైగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయని, 59 విద్యుత్ సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని కలెక్టర్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 2 వేల మందికి పైగా విద్యుత్ సిబ్బందిని రంగంలోకి దించినట్లు వెల్లడించారు.దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల స్థానంలో ఏర్పాటు చేసేందుకు 10 వేల కొత్త స్తంభాలను అందుబాటులో ఉంచామన్నారు. అమలాపురం, రామచంద్రపురం, రావులపాలెం, ముమ్మిడివరం తదితర పట్టణ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల కల్లా విద్యుత్ సరఫరా పునరుద్ధరించేలా చర్యలు చేపట్టామని, మిగిలిన గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి కల్లా సరఫరాను పునరుద్ధరించేందుకు లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
రహదారులపై రాకపోకల పునరుద్ధరణకు చర్యలు
జిల్లావ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై భారీ వృక్షాలు నేలకూలడంతో 93 ప్రధాన ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని కలెక్టర్ తెలిపారు. సంబంధిత శాఖల సమన్వయంతో రహదారులపై పడిన చెట్లను తొలగించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వివరించారు.
ఇప్పటికే 70 శాతానికి పైగా రహదారులను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించామని, మిగిలిన ప్రాంతాల్లో కూడా పనులను వేగవంతం చేసి మధ్యాహ్నానికి అన్ని ప్రధాన రహదారులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
13 వేల మందికి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం
తుఫాను ప్రభావం అధికంగా ఉండే తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 13 వేల మంది ప్రజలను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులకు ఆహారం, సురక్షిత తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు తదితర మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే బాధితులను సురక్షితంగా వారి నివాసాలకు పంపించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పటికీ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో డీజిల్ జనరేటర్ల ద్వారా తాగునీటి సరఫరాను కొనసాగించడంతో పాటు నీటి శుద్ధికి క్లోరినేషన్ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
5 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం
తుఫాను ప్రభావంతో జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు గణనీయమైన నష్టం వాటిల్లిందని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా అరటి, కొబ్బరి, కోకో తదితర ఉద్యాన పంటలు సుమారు 5 వేల హెక్టార్ల విస్తీర్ణంలో తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వివరించారు.
భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో వరి పంటలు నీటమునిగాయని, పంట నష్టాన్ని కచ్చితంగా గుర్తించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయి వివరాలు అందిన తర్వాత వాస్తవ నష్టాన్ని అంచనా వేస్తామని పేర్కొన్నారు.ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సహాయక, పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు.
విద్యుత్ తీగలు తెగిపడిన ప్రాంతాలు, చెట్లు నేలకూలిన ప్రదేశాలు, నీరు నిలిచిన రహదారుల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో పనిచేస్తోందని, సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమయంలో ప్రజలందరూ అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.



