ముగ్గురు మత్స్యకారులు సురక్షితం -అధికారులు, రెస్క్యూ బృందాల తక్షణ చర్యలతో తప్పిన ప్రమాదం
తాళ్లరేవు,కాకినాడ, (జిఎస్ బి వార్త )
కాకినాడ జిల్లా, తాళ్లరేవు (మం), చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు మంగళవారం వేటకు వెళ్లగా సముద్రంలో బోటు తిరగపడి గల్లంతయ్యారు. ఈదుకుంటూ వెళ్లి హోప్ ఐలాండ్ పొదల్లో చిక్కుకున్నారు. సమాచారం అందగానే మత్స్యశాఖ, ఆర్టీజిఎస్, విపత్తుల నిర్వహణ సంస్థలు వెంటనే రంగంలోకి దిగి 10 బోట్ల సహాయంతో చేపట్టిన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ద్వారా ఈరోజు వారిని గుర్తించి సురక్షితంగా తీరానికి చేర్చారు.
తుపాను తీవ్రత దృష్ట్యా వేటకు వెళ్లవద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు తమ ప్రాణాల రక్షణ కోసం ప్రభుత్వ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
