ముమ్మిడివరం, అక్టోబర్ 9 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీరో పావర్టీ మిషన్లో భాగంగా నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులపై సమగ్ర నివేదికలు రూపొందించేందుకు మహిళా సమాఖ్య సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముమ్మిడివరం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సంఘాల లీడర్లు, గ్రామ సంస్థ సహాయకులు (వీఓఏలు) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల వారీగా ప్రణాళిక శాఖ నుంచి అందే నిరుపేద కుటుంబాల జాబితాలను గ్రామ సంఘాల సమావేశాల్లో చర్చించి, అర్హులైన కుటుంబాలను గుర్తించాలని శిక్షణలో వివరించారు. ఆయా కుటుంబాలకు సంబంధించిన వివరాలను యాప్ ద్వారా సేకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.
ప్రతి నిరుపేద కుటుంబాన్ని గుర్తించి, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కచ్చితమైన సమాచారాన్ని సేకరించడం కీలకమని ఏపీఎం పీవీవీ రమణ తెలిపారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు మహిళా సమాఖ్య సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో సీసీలు మల్లాడి లక్ష్మి, జయలక్ష్మి, రత్నంతో పాటు మండల సమాఖ్య నాయకులు రోచర్ల నాగమణి, నక్క హైమావతి, కామాడి జయలక్ష్మి, గ్రామ సంఘాల లీడర్లు, వీఓఏలు పాల్గొన్నారు.




