కాకినాడ సిటీ అక్టోబర్ 2 జి ఎస్ బి వార్త
వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న కాంట్రాక్ట్ పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది సర్వీసులను బేషరతుగా క్రమబద్ధీకరించాలని (రెగ్యులరైజ్ చేయాలని), ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ పార్కు వద్ద నాయకులు, ఉద్యోగులు విధులను పక్కనపెట్టి మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై మౌన పోరాటంతో చ నిరసన గళం వినిపించారు.ఈ సందర్భంగా ఏపీ జేఏసీ
కన్వీనర్ రాజు మాట్లాడుతూ గత ఆగస్టు నెల నుంచే సమస్యలపై ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తున్నామని గుర్తుచేశారు. గత 15 నుంచి 20 ఏళ్లుగా అరకొర వేతనాలతో వెట్టిచాకిరీ చేస్తున్నామని, కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన వైద్య సిబ్బందిని విస్మరించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు అసౌకర్యం కలగకుండా గత 35 రోజులుగా శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా పాలకుల్లో చలనం లేకపోవడం శోచనీయమన్నారు. ఇతర విభాగాల్లో రెగ్యులరైజేషన్ ప్రక్రియ చేపడుతూ, అత్యవసర సేవలు అందించే వైద్య రంగాన్ని పక్కనపెట్టడం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు.ఈ నెల 3వ తేదీలోగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ వస్తుందని హామీ లభించిందని, ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని నేతలు తెలిపారు. రేపటిలోగా ప్రభుత్వం నుంచి అనుకూల స్పందన రానిపక్షంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని, అవసరమైతే విధులు బహిష్కరించి ‘పెన్ డౌన్’ తో పాటు పూర్తిస్థాయి సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. చర్చల నిమిత్తం ప్రభుత్వం కోరిన గడువు ముగుస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్ వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న దాదాపు 14,500 మంది కాంట్రాక్ట్ పారామెడికల్, నర్సింగ్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి.క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు బేసిక్, డీఏ, హెచ్‌ఆర్‌ఏలతో కూడిన 100 శాతం స్థూల వేతనం (గ్రాస్ శాలరీ) చెల్లించాలి.ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు, మెడికల్ లీవ్స్ వంటి కనీస సదుపాయాలు కల్పించాలి.ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ప్రశాంతి, రాష్ట్ర జేఏసీ ప్రతినిధులు జీవన్, చిన్నారి, ట్రెజరర్ బి. శైలజ, కో-కన్వీనర్ జగదీష్, ఐషు కుమార్, అహమద్ వల్లి, ఎం. లక్ష్మీకాంత్, చక్రవర్తి, సురేష్, కేఎస్డీ ఫిలిప్ తదితర ఉద్యోగులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మౌన ప్రదర్శనను విజయవంతం చేసిన ఉద్యోగులకు, సహకరించిన మీడియా ప్రతినిధులకు జిల్లా కన్వీనర్ రాజు కృతజ్ఞతలు తెలిపారు.

