ఐ.పోలవరం, అక్టోబర్ 5 (జీఎస్‌బీ వార్త): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ.పోలవరం మండలంలో పారిశుద్ధ్య కార్మికులకు వర్మీ కంపోస్ట్ తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సోమవారం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎంపీడీవో వి. రాజేష్ అధ్యక్షత వహించారు.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి చెత్తను వేరు చేసే విధానం, సేంద్రియ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారు చేసే ప్రక్రియపై అధికారులు అవగాహన కల్పించారు. చెత్తను సమర్థంగా నిర్వహించడం ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేసి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని వివరించారు.
కార్యక్రమంలో డీపీఆర్‌సీ ఎఫ్‌టీసీ కిరణ్ వర్మ, పి. శ్రీనివాస్, పి. రవి రాజ్, ఎంపిడిఓ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ ఎం.ఎన్. మూర్తి, పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు కె. వెంకటేశ్వరరావు, కె. రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.



