ఐ.పోలవరం, అక్టోబర్ 6 (జీఎస్బీ వార్త): కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ఐ.పోలవరం మండలం కేసనకుర్రు పంచాయతీ పరిధిలో రూ.2.67 కోట్ల విలువైన సుమారు 20 అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
గ్రామంలో రోడ్లు, డ్రైన్లు, సిమెంట్ రోడ్లు, తాగునీటి సదుపాయాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. జాంబవానిపేట, పేర్రాజు చెరువుల్లో నిర్మించిన వాటర్ ట్యాంకులను ప్రారంభించడంతో పాటు, జాంబవానిపేట అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.
పర్యటనలో భాగంగా అల్లూరివారి చెరువు, పెద్దపాలెం పాఠశాలలను ఎమ్మెల్యే సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల చదువు, ఉపాధ్యాయుల పనితీరు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేసనకుర్రు పంచాయతీ అభివృద్ధికి రూ.6 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించారని గ్రామస్థులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు. కేసనకుర్రు గ్రామంలో ఇప్పటివరకు రూ.6 కోట్లకు పైగా నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, చెల్లి అశోక్, కూటమి నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు, పాల్గొన్నారు.





